హైదరాబాద్: అర్బన్ నక్సలైట్లు చిన్న పిల్లలు తుపాకులు పట్టుకొని అడవులకు వెళ్లమని రెచ్చగొడుతున్నారని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. అర్బన్ నక్సలైట్లు పట్టణాల్లో ఎసి గదుల్లో కూర్చుని ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్లలో తిరుగుతూ సొంత పైరవీలు చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని, అర్బన్ నక్సలైట్లు తమ మాటలతో యువతను, మిగతా వారిని లొంగిపోవాలని చెప్పకుండా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న అభివృద్ధిని అడవుల్లో ఉన్నవారు కూడా గ్రహించారని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతిపై ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుందని బండి ప్రశ్నించారు. బిఆర్ఎస్, బిజెపి ఒకటే అని విమర్శించిన సిఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడతారని, ఇన్నాళ్లు గవర్నర్ అనుమతి ఇవ్వొద్దనే సిఎం రేవంత్ రెడ్డి కోరుకున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా అని ఇప్పుడు సిఎం ఏం చేస్తారో చూడాలని అన్నారు. అవినీతిపరుల ఆస్తుల జప్తు చేస్తానని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని బండిసంజయ్ పేర్కొన్నారు.