బీహార్ 18వ శాసనసభ 243 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాని మోడీ సారథ్యంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) అంచనాలకు మించి అఖండ విజయం సాధించడం సుపరిపాలనకు, అభివృద్ధికి అనుకూలంగా ప్రజలిచ్చిన తీర్పు. ప్రతిపక్ష మహాగట్‌బంధన్ నేతగా బరిలో నిలిచి హోరాహోరీగా తలపడి ఈసారైనా ముఖ్యమంత్రి కావాలని ఉధృతంగా ప్రచారం సాగించిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) యువనేత తేజస్వి యాదవ్ ఆశలు ఆడియా శలయ్యాయి. ఎన్‌డిఎను దీటుగా ఢీ కొట్టడానికి కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం, ప్రతి మహిళ ఖాతాలో నెలనెలా రూ. 2500 నగదు జమ చేస్తామని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గట్టి ప్రయత్నాలు చేస్తామని, పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి యువత జీవితాలలో వెలుగులు నింపుతామని ఆశలు రేపినా అధికార కూటమి ముందు వెలవెలపోవలసి వచ్చింది. ఇందుకు భాగస్వామ్య పక్షాల పనితీరు ప్రధాన కారణమని భావిస్తున్నారు.
ప్రాచీన జాతీయ పార్టీగా ఎన్నో ఏళ్లు ఈ దేశాన్ని, వివిధ రాష్ట్రాల్లో ఏకఛత్రాధిపత్యం నెరపిన కాంగ్రెస్ గంగా మైదాన రాష్ట్రాలు యుపి, బీహార్, పశ్చిమబెంగాల్‌లో మండల్ రాజకీయాల కారణంగా ప్రాభవం కోల్పోయి, సంస్థాగతంగా కోలుకోలేనంత శిధి ల స్థాయికి చేరడం, అయినా చేవలేకపోయినా అత్యధిక స్థానాలు తీసుకుని మహాపరాజయం చెందడం ఈ ఎన్నికలలో మరింత స్పష్టమైనది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్ధానాలలో పోటీచేసి 19 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈసారి సర్దుబాటులో 51, స్నేహపూర్వక పేరుతో మరో 10 మొత్తం 61 స్థానాలలో పోటీ చేసి కేవలం 6 సీట్లే గెలవడం గట్‌బంధన్‌కు శరాఘాతమైనది. గత ఎన్నికల్లో వామపక్షాలు 16 స్థానాలు గెలిచి (సిపిఐ ఎంఎల్ 12, సిపిఐ 2, సిపిఎం 2) కాంగ్రెస్ కంటే మెరుగ్గా ఫలితాలు సాధించినా ఈసారి సిపిఎంఎల్ కేవలం 2, సిపిఎం భిభూతిపూర్ ఒక్క స్థానాన్ని గెలవగా, సిపిఐ ఒక్క స్థానం లో కూడా విజయం సాధించలేకపోవడం విచారకరం. యాదవ, ముస్లిం బంధంతో 32% ఓట్లకుతోడు అత్యంత వెనుకబడిన (ఇబిసి) కులాల ఓట్లు రాబట్టే వ్యూహంలో భాగంగా నిషదులలో 2.6% ఉన్న మల్లా ఉపకులం ఓట్ల కోసం ముకేశ్ సహానికి ఉప ముఖ్యమంత్రి హామీతో వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)తో జట్టు కట్టినా ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేకపోయింది.
ముంబయిలో సినిమా సెట్ డిజైనర్‌గా పనిచేసే ముఖేష్ ఆరేడేళ్ల క్రితం బీహార్‌కు తిరిగి వచ్చి గత ఎన్నికల్లో ఎన్‌డిఎతో చేరి, డిప్యూటీ సిఎం పదవి హామీతో గట్‌బంధన్‌తో జట్టుకట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గంగా తదితర నదీ పరీవాహక ప్రాంతాలలో పడవలు నడపటం, చేపలు పట్టడం వంటి వృత్తుల్లో ఉన్న కేవట్, మల్లా తదితర మత్స్యకారులు బీహార్ జనాభాలో 8 శాతం, ఇబిసిలలో గణనీయంగా ఉన్నా వారు ప్రధానంగా జెడి(యు), ఎన్‌డిఎ మద్దతుదారులు. ఇలా ప్రధాన భాగస్వామ్య పక్షాలు అధ్వాన ప్రభావం చూపడంతో 50 మంది యాదవులకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చినా గట్‌బంధన్ మహా పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. అయితే తేజస్వి నేతృత్వంలోని ఆర్‌జెడి గత ఎన్నికలలో 75 సీట్లు గెలిచి పెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి 143 స్థానాలకు పోటీ చేసి కేవలం 25 సీట్లే గెలిచి, 50 సీట్ల కోల్పోయినా తన 23 శాతం ఓటు బ్యాంకును నిలబెట్టుకోగలగడం ఆ పార్టీకి కొంత ఊరట. బీహార్ వ్యవసాయ ప్రధాన నిరుపేద రాష్ట్రం. పట్టణ జనాభా కేవలం 11 శాతం. జీవాలు, పాడి పశువులు, మత్స్య పరిశ్రమపై ఆధారపడి మూడోవంతు రాష్ట్ర ప్రజలు మనుగడ సాగిస్తున్నారు.
గట్‌బంధన్ గెలిస్తే 1990 నుండి -95 వరకు సాగిన లాలూ, రబ్రీదేవిల ఆటవిక పాలన మళ్లీ వస్తుందని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్‌సింగ్, ఆరోగ్య మంత్రి నడ్డా, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభృత ఎన్‌డిఎ నాయకులు చేసిన భారీ ప్రచారం ఇబిసి కులాలు, మహా దళితులను భీతావహులను చేసింది. అదీగాక గత పదేళ్లకాలంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు మహిళలు, నిరుపేదలకు అందాయి. పల్లె రోడ్లతోబాటు జాతీయ, రాష్ట్ర రహదార్లను అభివృద్ధి చేసి రాకపోకలను సుగమం చేయడాన్ని ప్రజలు హర్షించారు. 1000 కి.మీగా ఉన్న గ్రామీణ రోడ్లను 1,16,880 కి.మీకు విస్తరించారు. గత 12 ఏళ్లలో పల్లెల్లో వివిధ గృహనిర్మాణ పథకాల కింద పేదలకు 59 లక్షల ఇళ్లను నిర్మించారు. గతంలో నీళ్లు, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రజలు ఎన్నో ఆందోళనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2019లో జలజీవన్ మిషన్ ప్రారంభించింది. గతంలో కేవలం 2 శాతం ఇళ్లకు మాత్రమే రక్షిత మంచినీటి సరఫరా ఉండేది.
గత ఆరేళ్లలో నితీశ్ ప్రభుత్వం 95.7 శాతం ఇళ్ళకు మంచినీటి సౌకర్యాలు కల్పించింది. అఖిలభారత స్థాయిలో రక్షిత నీటి సరఫరా 81.3%. జాతీయ సగటు కంటే తక్కువే అయినా బీహార్‌లో తలసరి విద్యుత్ వినియోగం గత 12 ఏళ్లలో 134 నుండి 363 యూనిట్లకు పెరిగి, 3 రెట్లు పెరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలేగాక మహిళా సాధికారతను పెంపొందించడం కోసం నితీశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా, పట్టుదలగా కృషి చేస్తూనే ఉంది. 2006 లోనే పంచాయతీలలో 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసిన మొదటి రాష్ట్రం బీహార్. ఆ తర్వాత ఆ రిజర్వేషన్లను పురపాలక సంఘాలకు విస్తరింపజేశారు. బాలికల విద్యను ప్రోత్సహించడానికి నితీశ్ ప్రభుత్వం 2006లో బాలికలకు సైకిళ్లు కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ. 2 వేలు ఇచ్చింది. అదీగాక హైస్కూలు నుండి డిగ్రీ వరకు వివిధ స్థాయిలలో బాలికలకు లక్ష వరకు ప్రత్యేక స్కాలర్ షిప్‌లు ఇస్తూ వచ్చారు. ఇందువల్ల విద్యాభ్యాసం కొనసాగించే బాలికల సంఖ్య 67 శాతానికి పెరిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. సోషలిస్టు అయిన నితీశ్ 1973లో స్వర్గీయ మంజు కుమారిని వివాహమాడినపుడు వరకట్నం వద్దని విలువలు పాటించారు. గత ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగి జెడి(యు)పై పోటీ పెట్టి ఆ పార్టీ విజయావకాశాలు దెబ్బతీసిన చిరాగ్ పాశ్వాన్ లోక్‌జనశక్తి పార్టీ ఈసారి ఎన్‌డిఎ భాగస్వామిగా 29 స్థానాలకు పోటీ చేసి, 19 గెలిచి బీహార్‌లో 4వ పెద్ద పార్టీగా నిలిచింది.
ఎల్‌జెపి, మహా దళిత నేత జితన్ రామ్ మాంజి భాగస్వాములుగా ఉన్నందున గత ఎన్నికల్లో 37% ఉన్న ఎన్‌డిఎ ఓట్లు 10 శాతం అంటే 47 శాతానికి పెరిగాయి. 2010 ఎన్నికలలో ఆర్‌జెడికి 22 స్థానాలు, ఎన్‌డిఎకు 206 స్థానాలు వచ్చాయి. 2020 ఎన్నికలలో 43 స్థానాలకే పరిమితమైన నితీశ్ జెడి(యు) ఈసారి రెట్టింపు (85) స్థానాలు గెలవడమేగాక, తన సుపరిపాలనతో మహిళలు, మహా దళితులు, అత్యంత వెనుకబడిన కులాలను బాగా ఆకట్టుకుని వాళ్ళు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని ఎన్‌డిఎ 67% పైగా ఓట్లు సాధించడంలో ప్రశంసనీయ పాత్ర పోషించారు. అందుకే జెడి(యు) ఈసారి 5% ఓట్లు పెరిగి, ఓట్లు 23 శాతానికి పెరగడం గమనార్హం. నితీశ్ ఎక్కడా కులమత ఘర్షణలు జరగకుండా పాలనలో కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు. మైనారిటీలకు రక్షణ కల్పించారు. నితీశ్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి బిజెపి కుతంత్రాలు పన్ని చిరాగ్‌ను ఎగదోసినా, పెద్ద పార్టీగా బిజెపికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అప్పుడప్పుడు కొందరు కమల నేతలు సన్నాయి నొక్కులు నొక్కినా అందుకు సాహసించలేకపోయారు. నితీశ్ హిందూత్వ ఎజెండాను దూరం పెట్టారు. ప్రధాని మోడీ, తదితర కమల నేతలు వాస్తవాన్ని గుర్తించి ప్రాప్తకాలజ్ఞతతో నితీశ్ నే పదోసారి సిఎంగా అంగీకరించారు.
బిజెపికి 2020లో 19.46% ఓట్లు రాగా, ఈసారి స్వల్పంగా 20.08 శాతానికి పెరిగాయి. 89 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా ఉన్నా పెరిగిన ఓట్లు కొంచమే. జెడి(యు), బిజెపి చెరి 101 స్థానాలకే పోటీ చేసినా గరిష్ట ఫలితాలు సాధించి రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ అధికారం చేపడుతున్నాయి. గత 20 ఏళ్లుగా మహిళా సాధికారతను సాకారం చేయడానికి, అన్నార్తులై ఎలుకలు వేటాడి ఆకలి తీర్చుకునే ముసాహిర్‌ల వంటి మహా దళితులు, అత్యంత వెనుకబడిన కులాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన నితీశ్‌కు కృతజ్ఞత తెలియజేయడానికే ఆ వర్గాలు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని అభివృద్ధి, సుపరిపాలనకే మద్దతు పలికాయి. ఇప్పటికీ బీహార్ జనాభాలో మూడోవంతు దుర్భర దారిద్య్రంలో ఉండటం, ఏటా ఉపాధి కోసం 25 లక్షల మంది వలసలు వెళుతూ ఉండటం, పల్లెలు జనాలతో కిక్కిరిసి ఉండటం, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి ఆదాయాలు పెంచడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలే. 13.4 కోట్ల బీహార్ జనాభాలో కోటి మంది వలస వెళ్ళారు.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందడం ఎంతో అవసరం. డబుల్ ఇంజిన్ సర్కార్‌లు అందుకు ఎంతో శ్రమించవలసి ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లక్షిత వర్గాలకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కేంద్ర పథకాల నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి ఒక ప్రత్యేక ఐఎఎస్ అధికారిని ఢిల్లీలో నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అభినందనీయం. ప్రాప్తకాలజ్ఞతతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో హస్తం పార్టీ సకలశక్తులు ఒడ్డి ఘన విజయం సాధించింది. బిజెపి డిపాజిట్లు కోల్పోయి చతికిలబడింది. కెసిఆర్ బిఆర్‌ఎస్ ఇప్పటికీ బలంగానే ఉంది. ఈ సంగతి గుర్తించి రేవంత్ రెడ్డి సమ్మిళిత సుపరిపాలనతో ముందుకు సాగాలి.
– పతకమూరు దామోదర్ ప్రసాద్
94409 90381