సేంద్రీయ వ్యవసాయంలో భారత్ ఒక గ్లోబల్ హబ్‌గా మారే దిశగా పయనిస్తోందని , ఇది దేశానికి స్థానికం,సంప్రదాయ విధానంగా ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. బుధవారం కోయంబత్తూర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తాను వేదిక పైకి రాగానే రైతులు తమ చేతి కండువాను గాల్లోకి ఊపారని, తాను రావడానికి ముందే బీహార్ గాలి ఇక్కడకు వచ్చిందనిపించిందని వ్యాఖ్యానించారు. సౌత్ ఇండియా నేచరల్ ఫార్మింగ్ సమిట్ 2025ను ప్రధాని మోడీ ఇక్కడ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. దేశం మొత్తం మీద తొమ్మిది కోట్ల రైతులకు మద్దతుగా పిఎం కిసాన్ పథకం 21వ వాయిదా కింద రూ.18,000 కోట్లను ప్రధాని మోడీ విడుదల చేశారు.
అవసరానికి మించి అత్యధికంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించడం నేల సారవంతం క్షీణిస్తుందని అందువల్ల సేంద్రీయ వ్యవసాయానికి మద్దతు ఇవ్వాలని సూచించారు. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోడానికి కూడా సేంద్రీయ వ్యవసాయం తోడ్పడుతుందన్నారు. దేశ ఆర్థిక పురోగతిపై ప్రధాని విజన్‌ను సూచించే ప్లకార్డులను ప్రదర్శించిన ఇద్దరు విద్యార్థినులైన బాలికలను గమనించి వారి ప్లకార్డులను సెక్యూరిటీ ద్వారా ప్రధాని రప్పించుకున్నారు. ఆ బాలికలను ప్రశంసించారు. అంతకు ముందు సిటీ ఎయిర్‌పోర్టు నుంచి కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గ్రౌండ్స్‌వరకు రోడ్‌షో నిర్వహించారు. దారిపొడుగునా ప్రజలు ప్రధానిపై పూలజల్లులు కురిపించారు.