శబరిమల ఆలయ పరిసరాలలో జనం కిక్కిరిసిపోవడంపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం అక్కడికి అసాధారణ సంఖ్యలో జనం రావడం, వారిని అదుపులో పెట్టలేకపోవడంపై ఆలయ నిర్వాహక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రావెన్‌కోర్ దేవస్థానం ధర్మకర్త మండలి నిర్వాహకులు, ఉన్నతాధికారుల మధ్య సరైన సమన్వయం లేనట్లు అక్కడి పరిస్థితితో స్పష్టం అయిందని కేరళ హైకోర్టు తెలిపింది. ఆలయ సమీపంలోకి దర్శనం తొలిరోజునే ఏకంగా రెండు లక్షల మంది వరకూ చేరుకుని ఉంటారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ ప్రాంతంలో దిక్కుతోచనిస్థితిలో గడిపారు. భారీ సంఖ్యలో జనాన్ని అనుమతించడం, సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఎప్పుడు దర్శనం తిరిగి ఆరంభం అవుతుందనేది తెలియదా? కనీసం ఆరు నెలలకు ముందే అన్ని ఏర్పాట్లు జరిగి ఉండాల్సింది అని న్యాయస్థానం మందలించింది. దీనికి దేవస్థానం బోర్డు చైర్మన్ కె జయకుమార్ అంగీకరించారు.