మన తెలంగాణ/అమరావతి: సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా. ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా ఆయన జీవించారని, భారతీయ నాగరికతకు సేవ మూల కేంద్రంన్నా రు. భక్తి, జ్ఞానం, కర్మ ఈ మూడూ సేవతోనే ముడిపడి ఉంటాయన్నారు. సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని వివరించారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, అందరి నీ ప్రేమించు, అందరినీ సేవించు ఇదే బాబా నినాదమని, ఆయన బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తుందన్నారు. కోట్లమంది బాబా భక్తులు మానవసేవ చేస్తున్నారని, బాబా ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయన్నారు. చాలామంది జీవితాలను బాబా సమూలంగా మార్చేశారని, లక్షలమందిని బాబా సేవామార్గంలో నడిపించారని ప్రధాని మోదీ అన్నారు. సేవ పరమో ధర్మ అనేది మన మూల జీవన విధానంలోనే ఉందని, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించారని, బోధించడమే కాకుండా తాను ఆచరించడంతో పాటు ఆయన సంస్థలూ అదే పాటించేలా శ్రీ సత్యసాయి బాబా అందరిలోనూ స్పూర్తి నింపారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ సత్యసాయి బాబా 100వ జయంత్యుత్సవాలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు హజరయ్యారు.
వీరితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, కిషన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ సహా పయ్యావుల, సవిత, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేశారు. సత్యసాయి స్మారక తపాళా బిళ్లల్ని ప్రధాని, సీఎం ఆవిష్కరించారు. మొదట శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. ఆ తర్వాత కుశ్వంత్ హాల్లో సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించిన శతజయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ సత్యసాయి బాబా మన మధ్య బౌతికంగా లేనప్పటికీ ఆయన స్థాపించిన సంస్థలు గ్రామీణ అభివృద్ధి, ప్రజలకు వైద్యం లాంటి సేవల్ని అందిస్తున్నారు. శ్రీసత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు జరుపుకోవటం మనకు ఓ వరం. బాబా పాటించిన ప్రేమ, సేవ భావన ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తోందన్నారు.
బాబా జీవితమే వసుధైక కుటుంబం
బాబా జీవితమే వసుధైక కుటుంబం అనే భావనతో ఉండేదని, మన భారతీయుల జీవన విధానమే సేవ, భక్తి, జ్ఞానం. కోట్ల మంది బాబా భక్తులు దేశవ్యాప్తంగా మానవ సేవే మాధవ సేవ అని భావించి సేవలు అందిస్తున్నారని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రకృతి వైపరీత్యం వచ్చినా శ్రీసత్యసాయి సేవా దళ్ సభ్యులు ప్రజలకు సేవలందిస్తున్నారు. భుజ్ భూకంపం సమయంలో సేవాదళ్ చేసిన సేవలు నాకు బాగా గుర్తున్నాయి. 3 వేల కిలోమీటర్లకు పైగా తాగునీటి పైపుల్ని ఏర్పాటు చేసి ప్రజలకు దాహార్తి తీర్చారు. వైద్యం ఉచితంగా అందిస్తున్న సంస్థలను బాబా నిర్మించారు. సుకన్య సమృద్ధి యోజన కోసం వేల మంది బాలికలకు ఆర్ధిక సాయం అందిస్తోంది ట్రస్టు.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 4 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఉన్నాయి. రూ. 3.25 లక్షల కోట్లకు పైగా నిధులు ఈ ఖాతాల్లో ఉన్నాయి. వారణాసి ఎంపీగా అక్కడ 27 వేల మంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజన కింద నిధులు జమ చేయించానన్నారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తే ఆత్మనిర్భర్ భారత్ తయారైనట్టేనని, శ్రీ భగవాన్ సత్యసాయి ప్రేరణతో అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి ఆలోచనలో కరుణ, శాంతి, కర్మ అనే విధానాల ద్వారా ముందుకు వెళ్లాలని ప్రధాన మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మానవ వనరులు, ఐటి, విద్యా, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్, ప్రముఖ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్, మాజీ మిస్ వరల్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి బాబా సేవలు ఆదర్శనీయం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం అని, లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేది శ్రీసత్యసాయి మనకు చూపిన దారి అని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన సత్యసాయి బాబా దాన్నే బోధించారు…ఆచరించారు…ఫలితం చూపించారన్నారు.. ప్రేమ ఒక్కటే మతం, హృదయం ఒక్కటే భాష, మానవత్వమే కులం, అన్నిచోట్లా దైవం ఉన్నారని బాబా బోధించారని, విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకూ ఉచితంగా అందించారని కొనియాడారు.
102 సత్యసాయి విద్యాలయాలు 60వేల మందికి ఉత్తమ విద్యను అందిస్తున్నాయని, సూపర్ స్పెషాలిటీ, జనరల్ ఆస్పత్రులు, మొబైల్ ఆస్పత్రుల ద్వారా రోజూ రోగులకు సేవలందుతున్నాయన్నారు. రాయల సీమ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రశాంతి నిలయాన్ని తాకట్టుపెట్టి అయినా ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నారని, ఈ విషయం తెలిసి భక్తులు ముందుకు వచ్చి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. రూ.550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షలకు పైగా జనాభాకు నీరిచ్చారన్నారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడరనైజేషన్ స్కీంకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారని, సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం భగవాన్ శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
జల్ జీవన్ మిషన్ కి బీజం వేసిన సత్యసాయి:ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
జల్ జీవన్ మిషన్ పథకానికి శ్రీ సత్యసాయి బాబా ఎప్పుడో అంకురం వేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం అని, ప్రభుత్వపరంగా నరేంద్ర మోదీ నేడు జల్ జీవన్ మిషన్ పథకాన్ని తీసుకువస్తే ఏ ప్రభుత్వం ఆలోచన చేయని రోజుల్లో ఓ ఆధ్యాత్మిక గురువుగా ప్రజల దాహర్తిని తీర్చాలన్న ఆలోచన శ్రీ సత్యసాయి బాబా చేశారన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గొప్ప ఆధ్యాత్మిక తేజస్సు కలిగిన వారని, సాయిబాబా సేవా తత్పరతకు ప్రభావితం అయిన వారి సంఖ్య లెక్కలకందదని చెప్పారు. పుట్టపర్తి వచ్చి సేవ చేసే ప్రముఖులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని, సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతో మంది ప్రముఖులను ప్రభావితం చేశారన్నారు. ఆయన సేవా స్ఫూర్తిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.
అది గోల్డెన్ మూమెంట్: భారత రత్న సచిన్ తెందూల్కర్
ప్రజల్ని జడ్జ్ చేయొద్దని, వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పారని క్రికెట్ దిగ్గజం, భారత రత్న సచిన్ తెందూల్కర్ అన్నారు. దీనివల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని అన్నారు. 2011 వరల్డ్ కలో తాను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవని, అప్పుడు బెంగళూరులో ఉన్నారని తెలిపారు. సత్య సాయిబాబా తనకు ఫోన్ కాల్ చేశారని, అనంతరం ఒక పుస్తకం పంపారన్నారు. అది తనలో సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని నింపిందని, ఆ సంవత్సరం టీం ట్రోఫీ కూడా గెలుచుకుందన్నారు. అది తనకు గోల్డెన్ మూమెంట్ అని సచిన్ తెలిపారు.