మావోయిస్టు పార్టీ అగ్రశ్రేణి దళం పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కమాండర్ హిడ్మా మరణం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. మధ్య భారతంలో దండకారణ్యం నేర్పుతున్న పాఠం మావోయిస్టులే కాదు, ఇప్పటికీ రకరకాల సూత్రీకరణలతో ఉనికిలో ఉన్న నక్సలైట్ గ్రూపులు, కమ్యూనిస్టులు, ప్రగతిశీల ఆలోచనాశీలురు కూడా ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మన ఆలోచన ప్రజలగురించి అయినప్పుడు మనం సామూహిక ప్రజా అభిప్రాయం గౌరవిస్తున్నామా? లేదా! కష్టాల్లో ఉన్న ప్రజలను మార్చడానికి మనకు నచ్చిన సైద్ధాంతిక వెలుగులో మనమే వెళ్ళి సాయుధం అయ్యామా? ప్రజలలో పనిచేసే క్రమంలో అనివార్య స్థితిలో సాయుధులుగా మారామా? ఈ రెండింటిలో సమస్య ఒకటే కావచ్చును. పంథాలు మాత్రం వేర్వేరు. సారూప్యత ఆయుధం అయినప్పుడు, క్రియ కూడా ఒక్కటే అది సాయుధ చర్య, కర్త మనమే అయినా కర్మ మాత్రం ప్రజలనే విశాల జన సమూహానికి సంబంధించినది. కనుక విశాల జనసమూహం అయిన ప్రజలను వేరు పరిచేదిగా కర్మ ఏ రకంగానూ ఉండరాదు. అటు ప్రభుత్వాలు, ఇటు సమూహాలకు అది వర్తిస్తుంది. ఇది ప్రధానపాఠం. రెండు అంశాలూ ప్రజలకు సంబంధించినవే అయినా ప్రజల సంసిద్ధత, శాంతియుత జీవనం, ప్రజలు అబివృద్ధి అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన గుణపాఠం సాయుధ పోరాటానికి ఉంది.
భారతీయ సాయుధ గిరిజన తిరుగుబాట్లను గమనిస్తే కోయ, గోండు, కోలాం, సంతాల్, మూండ తదితర తిరుగుబాట్లలో వాళ్ళ మనుగడ కోసం, జాతి జీవనం కోసం, జాతి అబివృద్ధి కోసం, ఆ జాతి నేతలతోనే! సాధారణ తిరుగుబాటుగా మొదలై శత్రువు దగ్గర ఆధునిక ఆయుధాలు అవసరార్థం గుంజుకొని ధైర్య సాహాసాలతో పోరాడినారు. ఓడినా వారి సమస్య ప్రపంచం దృష్టిలో పడేలా చేయగలిగారు. అడవిపై ఆధిపత్యం నిలబెట్టుకున్నారు. అలా తిరుగుబాటులో చనిపోయిన వారిని శతాబ్దాలుగా ఆరాధ్య దైవాలుగా ప్రజలు ఆరాధిస్తున్నారు. కొమరంభీం, బిర్సాముండా, సమ్మక్క సారక్క తదితర చారిత్రిక ఉదాహరణలు ఎన్నో? అటు ప్రభుత్వం దాడులు, ఇటు నక్సల్స్ సాయుధ చర్యల మధ్య నలిగిపోయి వలస వెళ్ళిన చత్తీస్‌గఢ్ ప్రజల సంఖ్య లక్షకు పైగానే ఉంటుంది. లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ సూత్రీకరణ అదే ధ్రువీకరణ చేస్తుంది. జనతన సర్కార్ పాఠశాల చదువులకు, గిరిజన ప్రజలు భూములకు చట్టబద్ధత లేకపోవడం ప్రజలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వైపు చూసేలా చేసింది. ఈ దశలో మావోయిస్టులు ప్రజలకు సన్నిహితంగా నిర్ణయాలు మార్చుకొని, రహస్య పార్టీ నిర్మాణం, ప్రజాసంఘాలు నిర్మాణం చేసిఉంటే జనంలో మద్దతు లభించేది.
కానీ, తాము సిద్ధాంతీకరించిన అర్థ వలస, అర్థం భూస్వామ్య స్థితి ఎన్నో ఏళ్ళ నాటి సామాజిక వ్యవస్థ? ఈనాడు అనేక సామాజిక మార్పులు సంభవించాయి. వీటిని గుర్తించకుండా సాయుధ పోరాట సైద్ధాంతిక కోణం నుండి బయటపడేందుకు ఇష్టపడకపోవడం వలన గత పదేళ్ళుగా తమను తాము కాపాడుకోవడమే మావోలకు సమస్యగా మారింది. మారిన సాంకేతిక పరిజ్ఞానం, వేగం పుంజుకున్న రవాణా సౌకర్యాలు, భౌతిక పరిస్థితి మావోయిస్టు పార్టీ ఉనికికి శత్రువుగా మారిపోయింది. పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కూడా ఎక్కడా సైన్యంతో తలపడిందిలేదు. తలదాచుకునే స్థితిలోనే హిడ్మా లాంటి చీఫ్ మరణించడం దాన్నే ధ్రువీకరిస్తూ ఉంది. ఈ దశలో కీలకమైన చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బిజెపి రాజకీయంగా మావోయిస్టు పార్టీ తో ఉన్న సైద్ధాంతిక వైరం, మరోవైపు రెండు వైపులా. దీన్ని అవకాశంగా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అణచివేత చర్యలు అనంతరం కఠినమైన ఆపరేషన్ కగార్ ద్వారా సైన్యాన్ని దించి తాడోపేడో తేల్చుకోవడానికి బిజెపి ప్రభుత్వం సిద్ధం అయింది.
బిజెపిమావోయిస్టు పార్టీ అణచివేతలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.అర్బన్ నక్సల్స్‌పై కేసులు నుండి ఆపరేషన్ కగార్ వరకు అంతా పకడ్బందీ ప్రణాళికతోనే నడిపింది. సైన్యం చుట్టుముట్టిన దశలో మావోయిస్టు పార్టీ దిద్దుబాటు చర్యలేవీ సఫలం కాలేదు? చర్చలు, కాల్పుల విరమణ లాంటివి ముందుకు తెచ్చినప్పటికీ ప్రతిపాదనలు ఏవీ కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే 600 మంది క్యాడర్‌తో పాటు కేంద్ర కార్యదర్శి సంబాల కేశవరావుతో సహా కేంద్ర కమిటీ సభ్యులు అనేక మంది చనిపోయారు. ఈ దశలో 500 మంది క్యాడర్‌తో సహా సాయుధ పోరాట విరమణ పేరుతో ఆయుధాలు అప్పగించి మల్లోజుల కోటేశ్వరరావు, తక్కేళ్ళపల్లి వాసుదేవరావు లాంటి కీలక నేతలు లొంగుబాటు, సాయుధ పోరాటం సమర్థించే మిగిలిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి, హిడ్మా లాంటి వారు మిగిలారు.
హిడ్మా ఎన్‌కౌంటర్, దేవుజీ లొంగుబాటు వార్తలు నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఉనికి ప్రమాదంలో పడినట్లే? ఎన్‌కౌంటర్స్ అన్నీ చాలా వరకు సజీవంగా పట్టుకొని చంపినవేనన్న పౌరహక్కుల సంఘాల ఆరోపణల్లో ఎంతోకొంత నిజం లేకపోలేదు? దేశంలో అవకాశవాద, నీతిరహిత రాజకీయ వ్యవస్థ వేళ్లూనుకుంటున్న దశలో నిజాయితీ కలిగిన రాజకీయ శక్తుల అవసరం నేడు ఎంతో ఉంది. కానీ, మారిన పరిస్థితిలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలబడే విప్లవశక్తులు అపజయం, వెనకడుగు నష్టమే! కానీ, ప్రజల పక్షాన నిలిచే శక్తుల అర్థరహిత త్యాగాలు కూడా సరైనవి కాదు? ఏ ఉద్యమానికైనా ప్రజల సంసిద్ధత, పరిపక్వత, సామాజిక అనుకూలత ముఖ్యం. అట్లాంటి సమయంలో మార్క్సిజం వెలుగులోనే నూతన మార్గాలు అన్వేషించాలసిన పరిస్థితి నేడు ముందుకు వచ్చింది. ప్రత్యామ్నాయ రాజకీయ ఐక్యపోరాటాలు అవసరం బలపడుతున్న మదోన్మత శక్తులు వేగంగా ముందుకు తెచ్చాయి.ఈ దశలో విశాలమైన ఐక్య సంఘటనకు బదులు నేలవిడిచి సాము చేయడం కరెక్ట్ కాదేమో? ఈ దశలో ఏ రకమైన పోరాటం అయినా ప్రజలకోసమే అయినప్పుడు ప్రజలను ప్రేక్షకులుగా నిలబెట్టే త్యాగాలు అవసరమా అన్నదే నేటి ప్రధాన ప్రశ్న?
– ఎన్. తిర్మల్ 9441865514