న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం తెలిపే విషయంలో రాజ్యాంగ న్యాయస్థానం కాలపరిమితి విధించగలదా అని అడిగిన రాష్ట్రపతి సూచనపై సుప్రీంకోర్టు గురువారం నాడు తన తీర్పును ప్రకటించనున్నది. దాదాపు 10 రోజులపాటు, వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్ నాథ్, సిఎస్ నరసింహ, ఎఎస్ చందూర్కర్ లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సెప్టెంబర్ 11న తన తీర్పును రిజర్వు చేసింది. మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగం లోని ఆర్టికల్ 143(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లిలు ఆమోదించిన బిల్లులను పరిష్కరించేటప్పుడు రాష్ట్రపతి విచక్షణతో వ్యవహరించడానికి న్యాయపరమైన ఆదేశాల ద్వారా కాలపరిమితి విధించవచ్చా, లేదా అని సుప్రీంకోర్టు నుంచి, తెలుసు కోవడానికి తనకు రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలను ఉపయోగించారు. తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ అధికారాలపై ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి నిర్ణయం వచ్చింది. రాష్ట్రపతి ఐదు పేజీల రిఫరెన్స్ లో ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలను సంధించారు.