ప్రతి ఏటా నవంబర్19న నిర్వహించబడే ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ఈసారి, అంటే 2025లో, ప్రపంచ పారిశుధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన వేగవంతమైన, స్థిరమైన చర్యల ఆవశ్యకతను మరింత బలంగా నొక్కి చెబుతోంది. 2030 నాటికి అందరికీ సురక్షితమైన పారిశుద్ధ్యాన్ని అందించాలనే సుస్థిర అభివృద్ధి లక్ష్యం -6 వైపు ప్రపంచం ముందుకు సాగడంలో, ప్రతి పౌరుడికి మరుగుదొడ్డి సౌకర్యం అందించడం అనేది కేవలం ఒక సౌకర్యం కాదు, అది ఒక ప్రాథమిక మానవ హక్కు. భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ద్వారా గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మలవిసర్జన రహిత (ఒడిఎఫ్) హోదాను సాధించినప్పటికీ, పారిశుధ్య ఉద్యమం ఇంకా చాలా మైళ్ళ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంది. కేవలం మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే కాకుండా వాటిని నిరంతరంగా, సరిగ్గా వినియోగించడం, మురుగు వ్యర్థాలను సురక్షితంగా నిర్వహించడం అనే తరువాతి దశపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. సురక్షితమైన మరుగుదొడ్డి సదుపాయం వలన కలిగే ఉపయోగాలు కేవలం వ్యక్తిగత శుభ్రతకు మాత్రమే పరిమితం కాకుండా, దేశ సామాజిక, -ఆర్థిక పురోగతికి మూలస్తంభాలుగా నిలుస్తాయి.
పారిశుధ్యం మెరుగుపడడం వల్ల అతిసారం, కలరా, టైఫాయిడ్ వంటి మల-నోటి మార్గాల ద్వారా వ్యాపించే తీవ్రమైన వ్యాధులు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా, ప్రతి సంవత్సరం అపరిశుభ్రత కారణంగా చిన్న పిల్లల్లో సంభవించే మరణాలను అరికట్టడంలో మరుగుదొడ్డి వినియోగం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ప్రతి సంవత్సరం 60,000 నుంచి 70,000 మంది పిల్లల ప్రాణాలు రక్షించబడుతున్నాయంటే ఈ ఉద్యమం ప్రజారోగ్యంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. మరుగుదొడ్డి వినియోగం వలన మహిళలు, బాలికలకు ఆత్మగౌరవం, భద్రత లభిస్తాయి. బహిర్భూమికి వెళ్లవలసిన అవసరం లేకపోవడం వల్ల చీకట్లో లేదంటే ఒంటరిగా వెళ్లవలసిన భయం తొలగిపోతుంది. తద్వారా వారు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా మెరుగైన పారిశుధ్యం విద్యపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. బాలికలు ఋతుస్రావ సమయాల్లో కూడా పాఠశాలలకు వెళ్లడానికి ప్రోత్సహించబడుతారు. ఎందుకంటే వారికి పాఠశాలల్లో శుభ్రమైన, సురక్షితమైన టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
పారిశుధ్య లోపం కారణంగా అనారోగ్యం పాలై పని దినాలను కోల్పోవడం తగ్గుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. ప్రజల ఉత్పాదకత పెరుగుతుంది. మరుగుదొడ్ల నిర్వహణ వినియోగంలో ఇబ్బందులు భారతదేశంలో పారిశుధ్య లక్ష్యాలను పూర్తిగా చేరుకోవడానికి అతిపెద్ద సవాళ్లుగా నిలుస్తున్నాయి. మొదటి దశలో మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా జరిగినప్పటికీ, వాటిని స్థిరంగా, సరైన పద్ధతిలో ఉపయోగించడంలో సాంస్కృతిక అడ్డంకులు, అలవాట్లు అడ్డుపడుతున్నాయి. ‘ఇంట్లో టాయిలెట్ నిర్మించుకోవడం అశుభం’ అనే మూఢనమ్మకాలు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. రెండవ అతిపెద్ద సవాలు ఏమిటంటే వ్యర్థాల నిర్వహణ. స్వచ్ఛ భారత్ మిషన్ దశ- 2 లో ప్రధానంగా దృష్టి సారించింది దీనిపైనే. పట్టణాల్లో సెప్టిక్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల మానవ వ్యర్థాలు నేరుగా నీటి వనరుల్లోకి వెళ్లి వాటిని కలుషితం చేస్తున్నాయి. దేశంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలలో 30% కంటే తక్కువ మాత్రమే శుద్ధి అవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
మల బురదను శుభ్రం చేయడానికి యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అనేక చోట్ల ఇంకా పారిశుధ్య కార్మికులను మ్యాన్‌హోళ్లలోకి పంపడం జరుగుతోంది.ఈ అమానుషమైన, ప్రమాదకరమైన పద్ధతిని పూర్తిగా నిర్మూలించకపోవడం మన పారిశుద్ధ్య ఉద్యమంపై ఒక చీకటి మరక. ముఖ్యంగా, వాతావరణ మార్పుల ప్రభావం కూడా పారిశుధ్య వ్యవస్థలపై పడుతోంది. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు పల్లపు ప్రాంతాల్లోని మరుగుదొడ్లు, సెప్టిక్ ట్యాంకులు పొంగి, వ్యర్థాలన్నీ ప్రజలు నివసించే ప్రాంతాల్లోకి, తాగునీటి వనరుల్లోకి చేరి నీటి కాలుష్యం, వ్యాధుల వ్యాప్తికి దారితీస్తున్నాయి. దీనికితోడు పట్టణీకరణ వేగం పెరగడంవల్ల పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుధ్య మౌలిక సదుపాయాలను విస్తరించడం, పాతబడిపోతున్న వ్యవస్థలను ఆధునీకరించడం అనేది స్థానిక సంస్థలకు ఆర్థికంగా, సాంకేతికంగా పెద్ద భారం. 2025 ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా, భారతదేశం కేవలం మరుగుదొడ్లను నిర్మించడం నుండి ‘సురక్షితంగా నిర్వహించబడే పారిశుద్ధ్యం’ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
అంటే, మానవ వ్యర్థాలు సేకరించబడి, రవాణా చేయబడి, శుద్ధి చేయబడి, సురక్షితంగా పారవేయబడేవరకు జరిగే ప్రక్రియ అంతా సురక్షితంగా ఉండాలి. దీని కోసం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. నీటిని తక్కువగా ఉపయోగించే ‘బయో -టాయిలెట్లు’, వికేంద్రీకృత వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, గోబర్‌ధన్ వంటి ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా వ్యర్థాలను శక్తి వనరులుగా మార్చవచ్చు. పారిశుధ్య సేవలను అందించడంలో మహిళా స్వయం సహాయక సంఘాలు, ట్రాన్స్‌జెండర్ వర్గాలను భాగస్వాములను చేయడం ద్వారా వారికి ఉపాధి కల్పించడంతోపాటు, పారిశుధ్య సేవల్లో సామాజిక సమ్మిళితత్వాన్ని తీసుకురావాలి. నిధులు, ప్రభుత్వ సంకల్పంతో పాటు ప్రజాభాగస్వామ్యం అనేది ఈ ఉద్యమం విజయానికి కీలకం. ప్రతి పౌరుడు మరుగుదొడ్డిని తమ ఇంటి గౌరవంగా, కుటుంబ ఆరోగ్యానికి భరోసాగా భావించి, దానిని శుభ్రంగా ఉంచే అలవాటును పెంచుకోవాలి. అప్పుడే, భారతదేశం నిజంగా బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మారి, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. మరుగుదొడ్డి అనేది కేవలం ఒక నిర్మాణం కాదు, అది ఆరోగ్యకరమైన, ఆత్మగౌరవంతో కూడిన భవిష్యత్తుకు వేసే గట్టి పునాది.
– జనక మోహన రావు దుంగ
– 8247045230
( నేడు ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం)