బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ రికార్డు స్థాపించబోతున్నారు. బీహార్‌లో ఎన్‌డిఎ ఘన విజయం తరువాత ఆయన 10వ సారి గురువారం ప్రతిష్టాత్మక రీతిలో ప్రమాణం చేస్తారు. స్థానిక గాంధీ మైదాన్‌లో ఉదయం 11 గంటలకు ఆయన బీహార్ అధికార పీఠం అధిరోహిస్తూ ప్రమాణం చేస్తారు. బుధవారం ఉదయం విజయపక్షం అయిన ఎన్‌డిఎ నూతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇందులో ఎన్‌డిఎ శాసనసభాపక్ష నేతగా నితీశ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిజెపి నేత, ఇప్పటి డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి ఈ సందర్భంగా నితీశ్ పేరును ప్రతిపాదించారు. బిజెపి, జెడియు ఎమ్మెల్యేలంతా బలపర్చారు. దీనితో మరోసారి బీహార్ సిఎంగా నితీశ్ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం అయింది. బిజెపి, జెడియుల సంయుక్త శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కొద్ది సేపటి తరువాత నితీశ్‌కుమార్ తన వెంట బిజెపి నేతలు కూడా రాగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలిశారు. లాంఛన ప్రాయంగా తన సిఎం పదవికి రాజీనామా చేశారు.
తాను శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన పత్రాన్ని అందించారు. గవర్నర్ ఈ రాజీనామాను ఆమోదించినట్లు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లు వెల్లడైంది. రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలో చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) నేత ఉపేంద్ర కుశావా, యుపి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఇతరులు కూడా ఉన్నారు. నూతన ప్రభుత్వ స్థాపనకు అభ్యర్థించారు. పాట్నాలోని బీహార్ లెజిస్లేచర్ సెంట్రల్ హాల్‌లో బిజెపి, జెడియుల కార్యకర్తల హర్షధ్వానాల నేపథ్యంలో లెజిస్టేటివ్ పార్టీ సమావేశం జరిగింది. నితీశ్ ఆధ్వర్యంలోనే ఎన్‌డిఎ ప్రచారం , తరువాతి క్రమంలో సిఎం కూడా ఆయనే అని ప్రధాని మోడీ పదేపదే చెపుతూ వచ్చారు. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు నితీశ్‌కు పట్టం జరుగుతోంది. నితీశ్‌జీనే తమ సంయుక్త పక్ష నేత అని , చెక్కుచెదరని తీర్పు వెలువరించిన బీహారీలకు అభినందనలు అని కేంద్ర మంత్రి , లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఎన్‌డిఎ కూటమి సమావేశం వివరాలను ఆ తరువాత విలేకరులకు రాష్ట్ర మంత్రి శ్రావణ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. చారిత్రక గాంధీ మైదాన్‌లో నితీశ్ మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. నితిశ్‌తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేస్తారని వెల్లడైంది.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు , బిజెపి అగ్రనాయకులు, ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల సిఎంలు హాజరుకానున్నారు. దీనితో పాట్నాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పలు ప్రధాన రాదార్లలో తనిఖీలు, పర్యవేక్షణ ఇనుమడించింది. అంతకు ముందు బుధవారం ఉదయమే బిజెపి శాసనసభాపక్షం సమావేశం జరిగింది. ఇందులో సీనియర్ బిజెపి నేత సామ్రాట్ చౌదరిని బిజెపి శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇక డిప్యూటీ నేతగా విజయ్‌కుమార్ సిన్హాను ఎంచుకున్నారు. వీరిద్దరికి నూతన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రుల పదవులు దక్కనున్నాయి. ఈసారి ఎన్నికలలో మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్‌డిఎకు 202 స్థానాలు దక్కాయి. ఇందులో బిజెపికి 89, జెడియుకు 85, ఎల్‌జెపికి 19, హామ్‌కు 5, ఆర్‌ఎల్‌ఎంకు 4 స్థానాలు వచ్చాయి. ఈ క్రమంలో బిజెపి అత్యధిక స్థానాల పార్టీ అయినా తిరిగి జెడియు నేత నితీశ్‌కు సిఎం పదవి కట్టబెట్టారు. బిజెపి నుంచి ఉపముఖ్యమంత్రులు కొనసాగనున్నప్పటికీ, నితీశ్ మంత్రిమండలిలో బిజెపికి ఎన్ని బెర్తులు? జెడియుకు ఎన్ని? ఇతర పార్టీలకు ఎన్ని? కీలక శాఖలలో ఎవరికి అవకాశం ఉంటేందనేది స్పష్టం కాలేదు. దీనిపై తగవులు రాకుండా చేసుకునేందుకు ప్రధానపార్టీల నేతలు రంగంలోకి దిగారు.