దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలోనూ టాయిలెట్ లు ఉండాలని, ఎవరూ బహిరంగ ప్రదేశాలలో మల మూత్రవిసర్జన కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్న లక్ష్య సాధనలో గొప్ప ప్రగతి సాధ్యమైంది. దేశంలో 5.67 లక్షల గ్రామాలలో ఇంటింటా టాయిలెట్ లు నిర్మాణమయ్యాయి. ఈ గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ ( బహిరంగ మల విసర్జన రహిత స్థితి గలిగినవి)గా ప్రకటించారు. 2022 నుంచి ఓడిఎఫ్ లు 467 శాతం పెరుగుదల సాధ్యమైంది. బుధవారం ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసిన డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది.వీటిలో 4.86 లక్షల గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ దశను సాధించాయి. ఫలితంగా గ్రామాలలో శుభ్రతకు అత్యంత పెద్దపీట వేసినట్లయింది.భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మింపజేయడంలో కేంద్రం, రాష్ట్రాలకు మద్దతు ఇచ్చిందని కేంద్ర జల్ శక్తి శాఖమంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. ప్రభుత్వం కృషితో పాటు ప్రజలు పెద్దసంఖ్యలో భాగస్వాములు కావడం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు.