గ్రూప్ 2 పరీక్షలపై హైకోర్టు వెలువరించిన తీర్పుపై టిజిపిఎస్‌సి రివ్యూ అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉంది. రాష్ట్ర హైకోర్టు 2015 గ్రూప్-2 నియామకాలు రద్దు చేస్తూ సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై బుధవారం కమిషన్ సమావేశమై చర్చించింది. తీర్పు ప్రభావం ఎలా ఉంటుంది, తరువాత తీసుకొనే చర్యలతో పలు అంశాలపై కమిషన్ చైర్మన్, సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. గ్రూప్ 2 పరీక్షలకు 2015,16లో నోటిఫికేషన్ వెలవడగా పరీక్షల అనంతరం మూల్యాకంనంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో 2019లో సాంకేతిక కమిటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం 1032 మందికి పలు విభాగాల్లో నియమించింది.
నియామకాలు జరిగిన 6 ఏళ్ల తరువాత పరీక్షలను హైకోర్టు రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించడంతో ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన పడుతున్నారు. ఈ విషయంపై టిజిపిఎస్‌సి సైతం హైకోర్టునే ఆశ్రయించాలని భావిస్తోంది. కాగా 2015లో గ్రూప్-2 పరీక్షల్లో ఓఎంఆర్ షీట్స్ ట్యాంపరింగ్‌కు గురయ్యాయని పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా కమిషన్ వ్యవహరించిందని తాజాగా వెల్లడించిన తీర్పులో హైకోర్టు మండిపడింది. ఈ క్రమంలో గ్రూప్ 2 నియామకాలను రద్దు చేస్తూ, ఓఎంఆర్ షీట్లను పునర్మూల్యాంకనం చేయాలని, ఈ ప్రక్రియ ఎనిమిది వారాల్లోపు పూర్తి చేయాలని టిజిపిఎస్‌సిని ఆదేశించింది.