కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) అంటే దేశంలో పత్తిని కొనుగోలు చేసి, అవసరమైన దేశాలకు ఎగుమతి చేసే కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోని వాణిజ్యపరమైన సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ అనుసరిస్తున్న విధానం దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పత్తిరైతులకు విపత్తు తెచ్చే సంస్థగా తయారైంది. తెలంగాణలో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. దీని దిగుబడి 24.70 లక్షల టన్నుల వరకు ఉండవచ్చని అంచనా. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. సుమారు 8 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట విపరీతంగా దెబ్బతింది. ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతుకు ఇప్పుడు సిసిఐ పెట్టిన నిబంధనలు దిక్కుతోచని పరిస్థితిని కల్పిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పిన సిసిఐ 7 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం రైతుల నెత్తిపై పిడుగుపడింది. అదీకాక రూ. 8110 మద్దతు ధర చెల్లించాలంటే తేమ 12% మించరాదని నిబంధన విధించింది. అసలే శీతాకాలం, పైగా మంచు ప్రభావం, ఇటీవల వరకు మొంథా తుఫాన్ బీభత్సం ఈ వైపరీత్యాల కారణంగా చాలా చోట్ల పత్తి దెబ్బతింది.
ఈ సమస్యలతో కుంగిపోతున్న పత్తిరైతుకు సిసిఐ నిబంధనలు నిలువునా దహించి వేస్తున్నాయి. తుఫాన్, భారీ వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఎకరాకు దిగుబడి 5 నుండి 7 క్వింటాళ్లకు మించి రాదని, అందువల్లనే ఎకరాకు 12 నుండి 7 క్వింటాళ్లకు సేకరణ తగ్గించామని సిసిఐ నచ్చచెబుతోంది. గత సంవత్సరం దిగుబడిపై పదిశాతం పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ సంవత్సరం పత్తి కొనుగోలు పరిమితిని ఎకరానికి 7 క్వింటాళ్లుగా నిర్ణయించినట్టు కేంద్ర జౌళిశాఖ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశారు. కానీ ఏం లాభం ఆ ప్రకారం కొనుగోలు చేయడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పత్తి దిగుబడి ఎకరానికి 11 క్వింటాళ్ల వరకు ఉంటుందని జిల్లా కలెక్టర్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్తి కొనుగోలు పరిమితిని ఎకరానికి 7 క్వింటాళ్లనుంచి 11 క్వింటాళ్ల వరకు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రంలో జిల్లాలవారీగా వాస్తవిక పత్తి దిగుబడి గణాంకాలు సేకరించి వెంటనే కేంద్రానికి పంపాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్రప్రభుత్వం సూచిస్తోంది.
ఇదిలా ఉండగా పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా చాలా ఆలస్యంగా ఏర్పాటయ్యాయి. సిసిఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకోవాలంటే ముందుగా రైతు సేవా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న తరువాత కేంద్రం ప్రవేశపెట్టిన ‘కిపాస్ కిసాన్ స్లాట్ ’లో 24 గంటల ముందు బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ విధానం మారుమూల ప్రాంతాల్లోని దాదాపు 70 శాతం మంది రైతులకు తెలియదు. ఈ బుకింగ్ విధానంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా రైతులు వెనుదిరిగి వెళ్లిపోవలసిందే. రవాణాకు ఖర్చులు భరించి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాక అనేక నిబంధనలు, ఆంక్షలతో కొనుగోలు చేయకపోయే సరికి దిక్కుతోచక బయట ప్రైవేట్ వ్యాపారులకు లేదా దళారులకు క్వింటాల్‌కు రూ. 6400 వంతున అమ్ముకోవలసి వస్తోంది. అంటే క్వింటాలుకు కనీసం దక్కాల్సిన రూ. 8000 కు కేవలం రూ. 6000 మాత్రమే దక్కుతుందంటే ఆ రైతు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో జిన్నింగ్ మిల్స్ మూతపడడంతో పత్తి కొనుగోళ్లు అసలు జరగడం లేదు. ఎల్1, ఎల్2 అంటూ కేటగిరిలవారీగా జిన్నింగ్ మిల్లులను విభజించడమే జిన్నింగ్ మిల్స్ మూతపడడానికి దారితీసింది.
అమెరికాతో సాగుతున్న వాణిజ్య చర్చలు కూడా పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలపై ప్రభావం చూపిస్తున్నాయని వాణిజ్యరంగాల నిపుణులు వివరిస్తున్నారు. అమెరికా పత్తి దిగుమతులపై ఉండిన 11% సుంకాన్ని భారత ప్రభుత్వం అకస్మాత్తుగా ఎత్తివేసింది. ఆ ఎత్తివేత మొదట గత ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే జరగ్గా, మళ్లీ ఇప్పుడు డిసెంబర్ వరకు పొడిగించారు. ఈ కారణంగానే గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా, అడ్డంకులు లేకుండా పత్తిని కొనుగోలు చేసే కాటన్ కార్పొరేషన్ ఇప్పుడు 7 క్వింటాళ్లు మాత్రమే కొంటానని చెబుతోందని విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. గ్రామీణ జనాభాలో దాదాపు 70% మంది వ్యవసాయంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. దేశ ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగం 15 శాతం వాటాను కలిగి ఉంది. దేశం లోని శ్రామిక శక్తిలో దాదాపు 45.5 శాతం మంది వ్యవసాయంతో ముడిపడి ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.
రైతు వ్యతిరేక చట్టాలు, అధిక రుణభారాలు, ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేకపోవడం, సబ్సిడీల్లో అవినీతి, పంట వైఫల్యం, ఆర్థిక సమస్యలు ఇవన్నీ రైతు కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ కారణాల వల్లనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అధ్యయనాలు వివరిస్తున్నాయి. 1995 నుంచి 2014 మధ్యకాలంలో 2,96,438 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 2014 నుంచి 2022 మధ్య తొమ్మిదేళ్లలో 1,00,474 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2022లో వ్యవసాయ రంగంలో రైతులు, కార్మికులు కలిపి మొత్తం 11,290 మంది ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశంలోని మొత్తం ఆత్మహత్య బాధితుల్లో ఈ సంఖ్య 6.6 శాతంగా ఉన్నట్టు తేలింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు పత్తిరైతులు తమ పంట దెబ్బతినడం, అప్పుల భారంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. రైతులను చిన్నచూపు చూసే కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభానికి తగిన విధంగా స్పందించి నివారణ చర్యలు తీసుకోకుంటే గతంలో ఎదురయ్యే ఆత్మహత్యల భయానక పరిస్థితులు మళ్లీ ఎదురయ్యే ప్రమాదం ఉంది.