ఐ- బొమ్మ కేసులో అరెస్టయిన ఇమ్మడి రవిని కస్టడికి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసి సినిమా రాకెట్‌లో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రవిని విచారించి కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని, ఈ క్రమంలో ఏడు రోజుల పాటు ఆయన్ను కస్టడికి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇమ్మడి రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, బప్పం, ఐ రాధ టీవీ పేర్లతో వెబ్‌సైట్‌లు రూపొందించి గత ఏడేళ్లుగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు వేదికగా మార్చిన ఇమ్మడి రవిని కూకట్‌పల్లిలో అరెస్ట్ చేసిన విషయం విధితమే.
అరెస్ట్ సందర్భంగా ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో రూ.3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లను అధికారులు గుర్తించారు. నిందితుడిని బషీర్‌బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్)కు తరలించి కీలక సమాచారం సేకరించారు. ఈ మేరకు బుధవారం నిందితుడిన నాంపల్లి కోర్టులో కస్టడి కోసం మరోసారి హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతించిన ఐదు రోజుల కస్టడి విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్మడి రవి కేసుపై ఇడి దృష్టి సారించింది. బెట్టింగ్ యాప్‌ల ద్వారా కోట్ల లావాదేవీలు జరిగాయని, ఇందులో మనీ లాండరింగ్ అంశం జరిగిందా అనే కోణంలో ఇడి ఆరా తీస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఇడి అధికారులు ఇప్పటికే పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో ఇమ్మడి రవి కస్టడి విచారణ కీలకం కానుంది.