సచివాలయం వద్ద సంఘటన
మనతెలంగాణ/హైదరాబాద్
సచివాలయం వద్ద బుధవారం సాయంత్రం అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. సచివాలయ ప్రవేశ ద్వారం ఎదుట ఏర్పాటు చేసిన అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్‌లో ఒక మహిళ కాలు ఇరుక్కుపోవడంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ తనిఖీల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రిల్ పై నుంచి వెళ్లిన సమయంలో ఆమె కాలు లోపలికి జారీ చిక్కుకుపోయింది. వెంటనే అక్కడ భద్రతా సిబ్బంది స్పందించి మహిళలకు సాయం అందించారు. స్కానర్ గ్రిల్ చాలా బలంగా ఉండటంతో, సాధారణంగా బయటకు తీయడం సాధ్యం కాకపోవడంతో ఎస్‌పిఎఫ్ సిబ్బంది ప్రత్యేక పరికరాలను తెప్పించి గ్రిల్‌ను కట్ చేసి, ఆమె కాలును సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, ఆమెను వెంటనే వైద్య పరీక్షలకు తరలించినట్లుగా ఎస్‌పిఎఫ్ సిబ్బంది తెలిపారు.