ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుంది
అవసరమైన నిధులను మంజూరు చేస్తాం
కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు, ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తెలిపారు. ఇందుకోసం అమృత్ యోజన నిధులు మంజూరు చేస్తామన్నారు. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల పురపాలక శాఖ మంత్రుల సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై కేంద్ర మంత్రి సమీక్ష జరిపారు. ప్రధానమంత్రి అవాస్ యోజన, అమృత్ యోజన పథకం సహా పలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్‌అండ్‌టి వైదొలిగిందని, ఇకపై కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగస్వామ్యం కానుందన్నారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం కింద హైదరాబాద్ మెట్రోలో కేంద్రం చేరుతుందన్నారు.
కాగా, దేశ వ్యాప్తంగా మెట్రోకు విశేష ఆదరణ లభించడంతో ఎక్కువ రాష్ట్రాలు మెట్రోను కోరుతున్నాయని ఆయనచెప్పారు. అయితే, భూసేకరణ పూర్తయిన ప్రాజెక్టులకు సంబంధించి ముందుగా ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు. హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో విస్తరణకు పూర్తిగా సహకరిస్తామని కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ హామీ ఇచ్చారు. ఇక మూసీ ప్రాజెక్ట్ పనులకు కూడా నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. అమృత్ యోజనలో భాగంగా నగర ప్రజలకు పరిశుభ్రరమైన త్రాగునీరు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. పిఎం ఆవాస్ యోజనకు సంబంధించిన గృహాల మంజూరు కూడా ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేస్తామని కట్టర్ వెల్లడించారు.
అమృత్ 2.0 కింద గుజరాత్, తెలంగాణ, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు
అమృత్ 2.0 కింద గుజరాత్, తెలంగాణ, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే మూడు సంవత్సరాల్లో తమ నగరాల్లో 100 శాతం నీటి సరఫరాను సాధిస్తాయని, మహారాష్ట్ర, డామన్ నగరాలు 90 శాతం కవరేజీని మించి చేరుకుంటాయని కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర అమృత్ 2.0 కింద 3,000 ఎంఎల్‌డి నీటిని రీసైక్లింగ్ చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గుజరాత్ 2030 నాటికి శుద్ధి చేసిన నీటిలో కనీసం 40 శాతం రీసైక్లింగ్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహాల కోసం కమిటీలను వేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.