సిఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి పిలుపు
ప్రజాభవన్‌లో సిఎం ప్రజావాణి లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా 55 బాధిత కుటుంబాల హాజరు
మన తెలంగాణ/హైదరాబాద్ : శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకుని వెళ్తున్న ప్రస్తుత ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్షత కొనసాగడం బాధాకరమని, సాంఘిక దురాచారాలపై సంఘటితంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిఎం ప్రజావాణి ఇంఛార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో సీఎం ప్రజావాణి, దళిత స్త్రీ శక్తి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళల పట్ల జరుగుతున్న వివక్షత, అత్యాచారాలకు గురైన మహిళల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని, పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళల పట్ల జరిగిన దాడులు, అన్యాయాలను మానవతా దృక్పథంతో పరిష్కరించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు చేపడుతామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది బాధితులు వచ్చి తమ సమస్యలు చెప్పి పునరావాసం కల్పించాలని, పరిహారం ఇప్పించాలని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సమావేశంలో కోరారు. దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఎన్‌ఆర్‌ఐ అడ్వైజర్ కమిటీ చైర్మన్ అంబాసిడర్ వినోద్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ క్షితిజ, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ కమిషనర్ సర్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, విజయేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సత్యనారాయణ, మూడు పోలీస్ కమీషనరేట్స్ నుంచి సీనియర్ పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.