యుద్ధంలో సైనికుడు చావుకు బెదరకుండా ముందుకు సాగుతాడు. ఆ తెగువ ఉన్నవాడి వల్లే సైన్యం కదులుతుంది. మనిషిలో జీవమున్నంత సేపే పోరాటంలో పాల్గొనడం సాధ్యపడుతుంది. విప్లవ సాయుధ పోరులోను ప్రాణాన్ని పణంగా పెట్టడం ఆ కార్యాచరణలో తొలిపాఠమే. ప్రాణంపోతే మనిషి జీవితం ముగిసినట్లే. పోతే తిరిగి తెచ్చుకోలేని ప్రాణం విలువ లెక్కకట్టలేనిది. అంతటి ఘనమైన త్యాగం వృథా కాకూడదు. గొప్ప లక్ష్యానికి జీవితకాలం వెచ్చించేందుకు సిద్ధపడ్డప్పుడు ప్రాణం కాపాడుకోవడం కూడా ఒక కొనసాగింపే. విషమ పరిస్థితుల్లో సాహసం కన్నా వ్యూహమే ప్రధానం. ఇక యుద్ధం ముందుకు సాగదనుకున్నప్పుడు అందరూ ప్రాణాలు పోగొట్టుకుంటే రేపటి పోరాటానికి ఏమి మిగలదు. బతికిఉంటే వంద యుద్ధాలు చేయవచ్చు. టాప్ కేడర్ పోలీసు తూటాకు బలి కావడమో లేదా లొంగిపోవడమో జరుగుతున్నప్పుడు పోరాటంలో భాగంగా వారికి, దళసభ్యులకు అంతా అగమ్యం గా ఉంటుంది. యుద్ధం ఒక మలుపు తీసుకుంటున్న తరుణంలో విజ్ఞత అవసరం. ఉద్యమం తుదికంటా లేకుండా అణచివేతకు రాజ్యం సిద్ధపడ్డప్పుడు తిరిగి మొలకెత్తేందుకు కొన్ని గింజలైనా మిగిలి ఉండాలి. శత్రువు వెదికివెదికి చంపుతున్నప్పుడు తెల్లజెండా చూపడం ఆపత్కాల నిర్ణయమే.
తోడు నడిచినవారు వరుసగా నేల రాలుతుంటే ఆలోచనలు అతలాకుతలం అవుతాయి. చెదిరిపోయిన దళాల మధ్య సయోధ్య తెగిపోతుంది. స్వీయ నిర్ణయాల అనివార్యత ఏర్పడుతుంది. ఇలా చావడం కన్నా ఎలాగైనా బతకడం ఒక ఆప్షన్. చివరకు అందరం చచ్చిపోవడమేనేమో అనే తలంపు కొత్త ఆలోచనలకు మూలం కావచ్చు. చావును తప్పించుకోవడానికి తలవంచడం ఓ మార్గం. దాన్ని ఎలా విశ్లేషించాలి అనే విషయంలో ఏకాభిప్రాయం కష్టమే. విప్లవ సేనానిగా గుర్తింపు పొందిన మల్లోజుల వేణుగోపాలరావు ఆ రకమైన లొంగుబాటు పూర్తి గా అనూహ్యమే. నిజానికి మావోయిస్టుల్లో అగ్రనేతలుగా కొనసాగిన మల్లోజుల సోదరులవి చరిత్రకు ఎక్కదగ్గ పోరు జీవితాలు. కోటేశ్వరరావు వీరమరణం పొంది తన అంతిమయాత్రలో చిరస్మరణీయంగా పెద్దపల్లికి ఎరుపెక్కించి విప్లవతారగా మిగిలిపోయాడు. సుదీర్ఘకాలం ఉద్యమంలో కలిసి నడిచిన అన్నదమ్ముల బాట అంతిమంగా ఆచరణలో విడిపోయింది.
అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మావోయిస్టుల వేట ఎన్నడూ లేనంతగా ఇప్పుడు తీవ్రమైంది. అరణ్యం నిత్యం మావోయిస్టుల రక్తంతో తడుస్తోంది. చావును తప్పించుకొని బతికితే తప్పేంటి అనే ఆలోచన సిద్ధాంతాన్ని అపహాస్యం చేస్తున్నట్లు అనిపించవచ్చు. బతకడమా చావడమా అనేది ఎప్పుడైనా వ్యక్తిగత నిర్ణయమే. బాగా ఆడుతాడనుకొన్న ఆటగాడు డకౌట్ అయితే అభిమానులు తిట్టి పోస్తారు. ఆడలేకపోయిన పరిస్థితి ఆ ఆటగాడికే తెలుసు. నక్సలైట్లుగా పనిచేస్తూ లొంగిపోయినవారు ఎంతోమంది ఉన్నారు. వివిధ వృత్తుల్లో వారు జనజీవితం గడుపుతున్నారు. లొంగిపోయినవారి పునరావాసం, పోలీసులతో వారు పడుతున్న ఇబ్బందుల గురించి అప్పుడప్పుడు వార్తలు వచ్చాయి కానీ, ఈమధ్య అదంతా సద్దుమణిగింది. అ సిద్ధాంతం రక్తంలో ఇంకిపోయాక బయటికి వచ్చినా ఆలోచన ధోరణి ఆ వైపే ఉంటుంది. ఆ మార్గం వీడలేదన్నట్లు కొందరు వివిధ సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మంచి ఆదాయం ఉన్నవారు తమ ఆసక్తుల మేరకు కళాపోషక పాత్ర పోషిస్తున్నారు. విద్య, వ్యాపారాల్లో స్థిరపడినవారు దాతృత్వాన్ని చేపడుతున్నారు. ప్రజాస్వామిక సభలు, సమావేశాల్లో వారు కీలకంగా కనబడుతున్నారు. మొత్తానికి నిన్నటి ఆలోచనకు విరుద్ధమార్గంలో నడిచేవారు తక్కువే. అంటే లొంగిపోయినవారు అడవిలో నక్సలైటుగా కాకున్నా అర్బన్ నక్సలైటుగా జీవితం కొనసాగించవచ్చు. చట్టం పరిధిలో, రాజ్యాంగబద్ధంగా మన దేశంలో చేసేందుకు బోలెడు పనులున్నాయి. వాటికి కూడా సాహసం, త్యాగనిరతి అవసరమే. శక్తి, ఆసక్తి ఉన్నంత కాలం ఆ పాత్ర పోషిస్తే లొంగుబాటు వృథా కాదు.
– బి. నర్సన్
-9440128169