నందమూరి బాలకృష్ణ హీరోగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్‌బికె111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. చరిత్ర, వర్తమానం మేళవింపుగా సాగే శక్తివంతమైన ఈ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు భిన్న కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహరెడ్డి’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మరోసారి ఈ దర్శకుడు, హీరో కలిసి వస్తుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించింది. ‘సముద్రమంత ప్రశాంతతను, తుఫాను అంత బీభత్సాన్ని తనలో మోసే రాణి మా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుంది’ అంటూ ఓ వీడియోతో నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని పేర్కొంది. నవంబర్ 26న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభకానున్నట్లు వెల్లడించింది.