5 జిల్లాల్లో 50 మందికి పైగా అరెస్ట్, భారీగా డంపులు గుర్తింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో పలు చోట్ల మావోయిస్టులు షెల్టర్‌గా మార్చుకుని ఆజ్ఞాతంలో ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 60 నుంచి 70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. విజయవాడ, కాకినాడ, అల్లూరి, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరులో మావోయిస్టుల ఉనికి తీవ్ర కలకలం రేపింది. ఇంటలిజెన్స్ సమాచారంతో విజయవాడ న్యూ ఆటోనగర్‌ను మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా మార్చుకున్నారన్న పక్కా సమా చారంతో మంగళవారం ఉదయం నుంచి కేంద్ర బలగాలు, ఆక్టోపస్, బాంబ్ స్కాడ్, స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దాదాపు రెండు, మూడు బస్సుల్లో పోలీసుల బలగాలు వచ్చిన ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
నాలుగు అంతస్తుల భవనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. చుట్టుపక్కల ఉన్న దుకాణాలు, పరిశ్రమలను మూసివేసి తనిఖీలు చేపట్టారు. సోదాల్లో 28 మంది మావో యిస్టులను అరెస్ట్ చేశారు. వారిలో 21 మంది మహిళలు, మరో ఏడుగురు కీలక హోదాల్లోని వ్యక్తులున్నట్లు తెలిసింది.. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. అయితే మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్ దగ్గర హిడ్మా డైరీ దొరికిందని అందులో ఉన్న సమాచారం ఆధారంగానే సెర్చ్ ఆపరేషన్ జరిగిందని అంటున్నారు. ఇందులో పలు కీలక విషయాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. డైరీలో షెల్టర్ల గురించిన సమాచారం రాసుకున్నారా? లేదంటే ఎలాంటి విషయాలు ఉన్నాయనే విషయం తెలియాల్సి ఉంది. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో విజయవాడ, కాకినాడ నగరాల్లో నిర్వహించిన సోదాల్లో ఇప్పటి వరకు (విజయవాడలో 32 మంది), (కాకినాడ నగరంలో 2) మొత్తంగా 34 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు తెలిసింది.
విచారణలో మావోయిస్టులు నగర శివార్లలో నాలుగు చోట్ల ఆయుధాలు, పేలుడు పదార్థాలతో కూడిన డంప్‌లను ఏర్పాటు చేసినట్లు కీలక సమాచారం లభించింది. దీంతో అప్రమత్తమైన బలగాలు ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు, మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన భవన యజమాని గత నెలన్నరగా విదేశాల్లో ఉన్నట్లు తేలింది. దీంతో భవన వాచ్‌మేన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నా రు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతా లకే పరిమితమైన మావోయిస్టులు వ్యూహం మార్చి విజయవాడ వంటి కీలక నగరంలో స్థావరం ఏర్పాటు చేసుకోవడం భద్రతా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నగరంలో ఉంటూ తమ కార్యకలా పాలను విస్తరించే ప్రణాళికలో భాగంగానే ఇక్కడికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమా నిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎపి నగరాల్లో అరెస్టు కావడం ఇదే తొలిసారి. ప్రత్యేకంగా బిహార్, ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడి వస్తున్నందున ఎవరికీ అనుమానం రాదని అందుకే దీన్ని సురక్షిత ప్రాంతంగా భావించినట్లు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా వీరు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ షెల్టర్ జోన్ ఎవరు ఇచ్చారు? మావోయిస్టులకు ఎవరైనా సానుభూతిపరులు ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కదలికలు పీక్‌లో ఉన్న ప్పుడు కూడా ఇలా జరగలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బలగాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటు న్నారు. ఈ క్రమంలో మే 2025లో నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత చార్జీ తీసుకున్న జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి (దేవూజీ) తమ ఉద్యమాన్ని పునరుజ్జీవనం చేయాలని పథక వేశాడు.. హిడ్మా ఈ ప్లాన్‌లో కీలక పాత్ర పోషించాడు. ఎపిలో కీలకమైన నేతల్ని హత్య చేయడం ద్వారా తమ ఉనికి బలంగా చాటాలనుకున్నారు. అయితే ఇంటలిజెన్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అరెస్టు చేశారు. అరెస్టుల తర్వాత పోలీసులు విజయవాడ న్యూ ఆటోనగర్, పెనమలూరు, ఏలూరు, కాకినాడలో సోదాలు చేశారు.
హిడ్మా డైరీలో రాసిన డంపులు ఆయుధాలు, సరుకులు, మెడిసిన్‌లు దాచిన చోట్ల కోసం రెండు రాష్ట్రాల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఎపితో పాటు చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా లో కూడా ఫోర్ -స్టేట్ సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. ‘మిగిలిన మావోయిస్టులు వలస కూలీల రూంలో దాక్కుని ఉండవచ్చని అనుమాని స్తున్నారు. ఈ ఘటనతో విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్ట్ అయిన వారిని మరింత లోతుగా విచారించి, వారి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా ఏలూరులో 15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆధ్వర్యంలో ఏలూరు శివారులోని గ్రీన్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఓ భవనంలో 15 మంది మావోయిస్టులను స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్టు చేసినట్లు సమా చారం.అదుపులోకి తీసుకున్న వారిని ఏలూరు రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలిం చారు. ఒడిశాకు చెందిన వీరంతా గత వారం రోజులుగా గ్రీన్ సిటీలో తలదాచుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు.
మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ ఎడిజి కీలక ప్రకటన
రాష్ట్రంలో హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ ఎడిజి మహేష్ చంద్ర లడ్హా కీలక ప్రకటన చేశారు. ‘మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. మంగళవారం ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్యలో ఎన్‌కౌంటర్ జరిగింది. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశాం. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. రెండు రోజులుగా ఇంటెలిజెన్స్ సమాచారంతో మావోయిస్టుల గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాం. అలాగే మావోయిస్టులతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. వీటిలో రెండు ఎకె 47లు,, ఒక పిస్టోల్ , ఒక రివాల్వర్, సింగిల్ బోర్ ఆయుధం, 1525 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, మరో ఎలక్ట్రికల్ వైర్ బండిల్, కెమెరా ఫ్లాష్ లైట్ , కటింగ్ బ్లేడ్ , 25 మీటర్ల ప్యూజ్ వైర్, ఏడు కిట్ బ్యాగులు ఉన్నాయి. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంద’ని ఎడిజి మహేష్ చంద్ర లడ్హా తెలిపారు.