రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు,తుది మెరిట్ జాబితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టిజి ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్టూ, మెడికల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2 పోస్టుల మొత్తం 24,045 మంది దరఖాస్తు చేసుకోగా..
గతేడాది నవంబర్ 10న జరిగిన ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షకు 23,323 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పూర్తి చేసిన అనంతరం తాజాగా బోర్డు 1,260 మందితో తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. దివ్యాంగుల కేటగిరీకి అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 2 పోస్టులను భర్తీ చేయలేదు. అలాగే హైకోర్టులో కొనసాగుతుండటంతో 4 పోస్టులను ఖాళీగా ఉంచింది. అదేవిధంగా, స్పోర్ట్ కేటగిరీలో ఉన్న 18 పోస్టులకు ఎంపిక జాబితాను వేరేగా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
గడిచిన రెండేళ్లలో 9 వేలకుపైగా పోస్టుల భర్తీ : మంత్రి రాజనర్సింహ
తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య శాఖలో 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి ముఖ్యమైన పోస్టులతో పాటు, వైద్య సేవలు మెరుగుపర్చేందుకు అవసరమైన ఇతర అన్నిరకాల పోస్టులనూ భర్తీ చేస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి డాక్టర్లు, సిబ్బంది లేక వెలవెలబోయిన హాస్పిటళ్లు, ఇప్పుడు కలకలలాడుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. డాక్టర్లు, సిబ్బంది రాకతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. వీలైనంత త్వరలో మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.