కుమారుడు, కుమార్తె నడుమ తీవ్ర వాగ్వాదం
ఓటమి నీ టీమే కారణం అన్న రోహిణి, కాదు నువ్వే కారణం అంటూ మండిపడ్డ తేజస్వీ
సహనం కోల్పోయి సోదరిపై చెప్పు విసిరివేత
నాన్నకు కిడ్నీ ఇస్తే దాన్ని మురికిది అని అవమానించారు
కోట్ల డబ్బు, పార్టీ టికెట్ తీసుకున్నానని నాపై నిందలు
లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఆవేదన
నన్నంటే ఊరుకుంటా.. అక్కను అగౌరవపరిస్తే ఊరుకోను: తేజ్ ప్రతాప్
పాట్నా : ఆర్‌జెడి సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుబంలో విభేదాలు మరింత ముదిరాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కుటుంబంలో గొడవలు భగ్గుమన్నాయి. ఫలితాల విషయంలో ఆర్‌జెడి నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్, కుమార్తె రోహిణి ఆచార్య నడుమ తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. శనివారంనాడు ఇక్కడి నివాసంలో వాదన జరిగిందని, ఈ క్రమంలో ‘ఓటమికి నువ్వే కారణం. నీ వల్ల మేం తీవ్రంగా నష్టపోయాం’ అని రోహిణిపై తేజస్వీ ఆగ్రహం వ్యక్తం చేశాడని ఆ పార్టీ వర్గాల సమాచారం. అంతటితో ఆగకుండా రోహిణిపై చెప్పు విసిరి తీవ్రంగా దూషించినట్లు తెలిసింది.
అంతకుముందు రోహిణి కూడా తీవ్రంగా బదులిలిచ్చినట్లు సమాచారం. తేజస్వీ టీమ్ అనుసరించిన ప్రచార సరళే ఓటమికి కారణమని, పరోక్షంగా తేజస్వీకి అత్యంత సన్నిహితులైన ఇద్దరు నేతలు సంజయ్ యాదవ్, రమీజ్‌పై ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. ఇదే తేజస్వీకి తీవ్ర ఆగ్రహం తెప్పించిందని, కారణం వాళ్లు కాదు నువ్వేనని రోహిణిపై తేజస్వీ ఒంటికాలిపై లేచినట్లు సమాచారం. దీనిపై లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ కూడా తీవ్రంగా స్పందించారు. తనను అంటే ఊరుకుంటానని, కానీ అక్కను అగౌరవపరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తేజ్ ప్రతాప్, తేజస్వీ నడుమ ఎప్పటి నుంచో విభేదాలు నెలకొన్నాయి. దీంతో తేజస్వీ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రోహిణి కూడా సరన్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓటమి చెందారు.