సిసిఐ నిబంధనలకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సమ్మెకు దిగడంతో సోమవారం రాష్ట్ర వ్యప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి అమ్ముకునేందుకు సిసిఐ కేంద్రాలకు తీసుకుని వచ్చినా సమ్మెతో కొనుగోళ్లు జరగకపోవడంతో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. సిసిఐ విధించిన ఎల్1, ఎల్2, ఎల్3 సమస్యను పరిష్కరించాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. రెండు దఫాలుగా ప్రభుత్వానికి అసోసియేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం నుండి సానుకూల వైఖరి లేకపోవడంతో అసోసియేషన్ సమ్మె బాట పట్టింది. సిసిఐ అవలంబిస్తున్న అసమతుల్య అలాట్‌మెంట్, స్లాట్ బుకింగ్ విధానాలతో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం చేయడంతో అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్1, ఎల్2, ఎల్3 విధానంతో వెసులుబాటు కల్పించి అన్ని మిల్లులు నడిపేవిధంగా అమలు చేయకపోవడం, దీని ఫలితంగా జాబ్‌వర్క్ కొన్ని మిల్లులకే కేటాయించడంతో మిల్లులు నష్టపోతున్నట్లు మిల్లర్లు వాపోతున్నారు.
దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్‌కు పని లేక వెనుదిరిగి పోతున్నారని, మిల్లుల నెలవారీ మెయింటనెన్స్ చార్జీలు అదనంగా మిల్లర్లపై పడుతున్నాయని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రైవేట్, సిసిఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తూ మిల్లర్లు సమ్మెకు వెళ్లారు. పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి పత్తిని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు భారీ సంఖ్యలో మిల్లుల ఎదుట బారులు తీరాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా కొనుగోలు నిలిపివేయడంతో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు ఎక్కిడికక్కడే నిలిపిచిపోయింది. ఎనుమాముల మార్కెట్ తో పాటు జిన్నింగ్ మిల్లుల్లో సైతం పత్తి కొనుగోళ్లు అగిపోయాయి. విషయం తెలియక పత్తి తీసుకొచ్చిన రైతులు పత్తి యార్డు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలోని అనుశ్రీ కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. కాగా, పత్తి కోనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో మిల్లర్లతో మంగళవారం జరిగే ప్రభుత్వం చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.