హైదరాబాద్: పైరసీ వల్ల చిత్రపరిశ్రమకు చాలా నష్టం జరిగిందని సిపి సజ్జనార్ తెలిపారు. చిత్ర పరిశ్రమకు మేలు జరిగే ఒక కేసును ఛేధించామని అన్నారు. సినీ పెద్దలతో సిపి సజ్జనార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. ఐబొమ్మ కేసులో కీలక నిందితుడు ఇమ్మడి రవిని నిన్న అరెస్టు చేశామని, ఇమ్మడి రవిపై మరో 4 కేసులు నమోదై ఉన్నాయని తెలియజేశారు. ఐటీ యాక్ట్, కాపీ రైట్ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయని, ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం చేశాడని మండిపడ్డారు. సినిమాల పైరసీతో చిత్రపరిశ్రమకు కోట్ల నష్టం చేశాడని, బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేయడంతో యువత ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. బెట్టింగ్ యాప్ వల్ల ఎంతోమంది డబ్బు, ప్రాణాలు కోల్పోయారని, పైరసీ ద్వారా ఇమ్మడి రవి రూ. 20 కోట్లు సంపాదించారని సజ్జనార్ పేర్కొన్నారు. 50 లక్షల మంది సబ్ స్క్రైబర్ల డేటా, సైట్ ను సందర్శించిన వారి డేటా మొత్తం ఇమ్మడి రవి వద్ద ఉందని అన్నారు. ఈ డేటా అంతా ఇలాంటి వారి వద్ద ఉండటం ప్రమాదకరమని సూచించారు. ఈ డేటాను అంతా డార్క్ వైబ్ సైట్లకు అమ్ముకునే అవకాశం ఉందని సజ్జనార్ స్పష్టం చేశారు.
సినిమాల పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితో సహా మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. శివాజీ, ప్రశాంత్ అనే ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో హైదరాబాద్ సిపి సజ్జనార్ ను నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు, నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, పలువురు సినీ ప్రముఖులు కలిశారు.