సిబిఐ అధికారులమని చెప్పి బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ నుంచి డిజిటల్ మోసగాళ్లు రూ.32 కోట్లు కాజేశారు. ముందుగా డీహెచ్‌ఎల్‌లో ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఓ వ్యక్తి సదరు మహిళకు ఫోన్ చేసి నమ్మించాడు. ఆమె పేరు మీద మూడు క్రెడిట్ కార్డులు, నాలుగు పాస్ పోర్టులు, నిషేధిత ఎండిఎంఎ ఉన్న ఓ పార్శిల్ ముంబై లోని అంధేరీ డీహెచ్‌ఎల్ కేంద్రానికి వచ్చిందని చెప్పాడు. ఆ ప్యాకేజీతో తనకు సంబంధం లేదని, తాను బెంగళూరులో నివసిస్తున్నట్టు ఆమె చెప్పింది. అయితే ఫోన్ చేసిన వ్యక్తి మీ ఫోన్ నెంబర్‌పార్శిల్‌లో లింక్ అయ్యి ఉందని, అది సైబర్ క్రైమ్ కావొచ్చని హెచ్చరించాడు. వాటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారని బెదిరించాడు. సీబీఐ అధికారుల నుంచి ఫోన్‌కాల్ వస్తుందని తెలిపాడు. అలాగే కాసేపటికి సీబీఐ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పార్శిల్‌లో ఉన్న ఆధారాల ద్వారా ఆమెను డిజిటల్ అరెస్టు చేసినట్టు బెదిరించాడు. అంతేకాదు మీపై నేరస్థులు నిఘా పెట్టారని, పోలీసులను సంప్రదించవచ్చని సూచించాడు.
అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే అన్ని ఆస్తులను ఆర్‌బిఐ కి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉందని నమ్మించాడు. వారి మాటలకు భయపడిపోయిన మహిళ వారు చెప్పినట్టు చేసింది. మొత్తం తన వద్ద ఉన్న ఆస్తులు , డబ్బు అంతా వారికి అప్పగించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర సేవింగ్స్‌ను మోసగాళ్లు పంపిన 187 బ్యాంకు ఖాతాలకు విడదల వారీగా బదిలీ చేసింది. ఇలా దాదాపు ఆరు నెలల్లో ఆమె నుంచి రూ.32 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. క్లియరెన్స్ పూర్తయ్యాక ఫిబ్రవరిలో ఆ డబ్బును తిరిగి ఇస్తామని నమ్మించారు. ఆ మేరకు నకిలీ క్లియరెన్స్ లెటర్‌ను కూడా జారీ చేశారు. కొన్నిరోజులకు ఆమె తన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి చేసింది. అయినా అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇలా కొన్నిరోజుల తరువాత వారు ఆమెతో కమ్యూనికేషన్‌ను ఆపేశారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.