మన తెలంగాణ/హైదరాబాద్‌ః జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయకేతనం ఎగుర వేయడంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మరింత పట్టు బిగించినట్లైంది. జూబ్లీ ఉత్సాహంతో తన బలాన్ని పెంచుకోవాలనుకంటున్నది. ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ఇదే అదనుగా తీసుకుని ప్రతిపక్షాలను ఎండగడుతూ, తమ బలాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా భావిస్తున్నది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలకు, జిహెచ్‌ఎంసి ఎన్నికలకు వెళ్ళడమే కాకుండా అసెంబ్లీలోనూ సంఖ్యా బలం పెంచుకోవాలనుకుంటున్నది. ఈ మేరకు ఖైరతాబాద్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఏ కడియం శ్రీహరి చేత శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించి తిరిగి ప్రజా తీర్పుకు వెళ్ళి అసెంబ్లీలో బలాన్ని పెంచుకోవాలనుకంటున్నట్లు సమాచారం.
ఇదిలాఉండగా తమ పార్టీ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన పది మంది ఎంఎల్‌ఏలపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ను కోరుతూ బిఆర్‌ఎస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పీకర్ పంపించిన నోటీసులకు ఎనిమిది మంది ఎంఎల్‌ఏలు స్పందించి కౌంటర్ దాఖలు చేశారు. వారిపై దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం స్పీకర్ వద్ద వాదనలు కొనసాగుతున్నాయి. కాగా మిగతా ఇద్దరు ఎంఎల్‌ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమకు సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇదిలాఉండగా కడియం శ్రీహరి ఆదివారం ‘మన తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ సమాధానం ఇచ్చేందుకు తనకు గడువు కావాలని స్పీకర్‌ను కోరానని చెప్పారు. తాను న్యాయవాదులతో సంప్రదించి సమాధానం పంపిస్తానని ఆయన తెలిపారు. దానం నాగేందర్ తనకు ఎటువంటి నోటీసు రాలేదని చెప్పారు. తమ పార్టీ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాము ‘కారు’లోనే ఉన్నామంటూ ఫిరాయింపు ఎంఎల్‌ఏలు స్పీకర్ ఎదుట తమ వాదన బలంగా వినిపిస్తున్నారు. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన దానం నాగేందర్ ఆరు నెలలకే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో తాను పార్టీ మారలేదనడానికి ఛాన్సే లేకుండా పోయింది. కాంగ్రెస్ నుంచి ‘బి-ఫారమ్’ తీసుకుని లోక్‌సభకు పోటీ చేసినందున తాను పార్టీ ఫిరాయించ లేదనడానికి అవకాశమే లేకుండా పోయింది.
పొంచి ఉన్న ప్రమాదం..
తాజాగా పశ్చిమ బెంగాల్ హైకోర్టు అనర్హత పిటిషన్‌పై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా కోల్‌కత్తా హైకోర్టు పార్టీ ఫిరాయింపులపై కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి టిక్కెట్‌పై గెలుపొందిన ముకుల్ రాయ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయించారని బిజెపి నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ముకుల్ రాయ్ శాసనభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంఎల్‌ఏలకూ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రమాదకరంగా పొంచి ఉందన్న ఆందోళన కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనర్హత వేటు పడక ముందే రాజీనామా చేయించి తిరిగి ప్రజా తీర్పుకు వెళ్ళడం మంచిదన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. అయితే ఫిరాయింపు ఎంఎల్‌ఏల అందరితో రాజీనామా చేయించకుండా, వాటిపై స్పీకర్ నిర్ణయానికి వదిలేసి, ప్రస్తుతానికి దానం నాగేందర్, కడియం శ్రీహరితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళితే బాగుంటుందని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారుః జీవన్ రెడ్డి
ఇదిలాఉండగా ఫిరాయింపు ఎంఎల్‌ఏలపై మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ ఎంఎల్‌ఏ టి. జీవన్ రెడ్డి అన్నారు. ఆ రాష్ట్ర స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోనందుకే అక్కడి హైకోర్టు అనర్హత వేటు వేసిందని ఆయన తెలిపారు. మన స్పీకర్ అలా చేయకుండా సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు.
జూబ్లీ జోష్ ఖైరతాబాద్‌లోనూ..
‘జూబ్లీ’ జోష్‌తో ఖైరతాబాద్ ఉప ఎన్నికకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తున్నది. దానం నాగేందర్‌నే కాకుండా కడియం శ్రీహరితో కూడా రాజీనామా చేయించి తిరిగి ఎన్నుకుంటే హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని నిరూపించుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నది పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది.
రాజీనామానా? మరో పది మందిని లాగడమా?
ఒకవైపు ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుండగా, ఇద్దరు ఎమ్మెల్యేలు దానం, కడియంతో రాజీనామా చేయించి తిరిగి పోటీ చేయించి గెలిపించుకోవడమా? లేక బిఆర్‌ఎస్ నుంచి మరి కొంత మంది ఎంఎల్‌ఏలను లాగడమా? అనే చర్చ జరుగుతున్నది. మరో పది మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలను చేర్చుకోవడం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకుండా రెండింట మూడో వంతు మందిని చేర్చుకుంటే మంచిదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. రెండింట మూడో వంతు మందిని చేర్చుకున్నట్లయితే బిఆర్‌ఎస్-ఎల్‌పిని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుందన్నది కాంగ్రెస్‌లో మరి కొందరి నేతలు అంటున్నారు.
జూబ్లీ ఫలితం తర్వాత బిఆర్‌ఎస్, బిజెపి నేతలు షాక్‌లో ఉన్నందున, ఇదే సరైన సమయమని, ఇలా వెంట వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్‌ఎంసి ఎన్నికలు, ఇంకా ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల ఎన్నికలకూ వెళ్ళి శాసనసభలో బలాన్ని పెంచుకుంటూ ఎదురులేని శక్తిగా నిలబడాలని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల కథనం.