బంగ్లాదేశ్ పదవీచ్యుత, ప్రవాస ప్రధాన మంత్రి షేక్ హసీనాకు దేశ ప్రధాన ట్రిబ్యునల్ సోమవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అమానుష నేరాలు, ఊచకోత అభియోగాలపై ఈ 78 సంవత్సరాల అవామీ లీగ్ నేత హసీనాకు విచారణ గైర్హాజరీ దశలోనే శిక్ష తీర్పు వెలువరించారు. బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ నేరాల విచారణ ట్రిబ్యునల్ (ఐసిటి) నెలరోజుల విచారణ తరువాత అత్యంత సంచలనాత్మక, అంతర్జాతీయ పరిణామాల ప్రకంపనల నిర్ణయం వెలువరించింది. హసీనా ప్రస్తుతం పొరుగుదేశం భారత్‌లో అజ్ఞాత ప్రాంతంలో కుటుంబంతో గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి నివసిస్తున్నారు. దేశ ప్రధానిగా ఉన్నప్పుడు గత ఏడాది జులై చివరిలో తనకు వ్యతిరేకంగా చెలరేగిన తీవ్రస్థాయి నిరసన ప్రదర్శనలను హసీనా అత్యంత పైశాచికంగా, అమానుషంగా అణచివేశారని , ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 1300 మందికి పైగా చనిపోవడానికి కారకులు అయ్యారని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై అభియోగాలు మోపింది.
అణచివేత చర్యలకు ఆమెను ప్రధాన సూత్రధారి, ప్రేరకురాలని ఇందుకు మరణశిక్షకు గురి కావల్సిందే అని ఐసిటి తమ తీర్పులో తెలిపింది. గత ఏడాది బంగ్లాదేశ్‌లో ప్రత్యేకించి విద్యార్థుల నిరసనల అణచివేత క్రమంలో తలెత్తిన రక్తపాతాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఘటనల తరువాత తలెత్తిన తిరుగుబాటు క్రమంలో బంగ్లా ప్రధాని హసీనా దేశం విడిచి పారిపోయారు. మిత్రపక్ష దేశం భారత్‌లో తలదాచుకున్నారు. పలు సార్లు సమన్లు పంపించినా ఆమె విచారణకు రాకపోవడంతో ఆమెను కోర్టు ఫరారీ నేతగా ప్రకటించింది. ఆమె పరోక్షంలోనే విచారణ జరిపింది. బంగ్లాదేశ్‌లో పార్లమెంటరీ ఎన్నికలకు నెలల ముందు తీర్పు వెలువడింది. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీకి అవామీలీగ్‌పై అనర్హత వేటు ప్రకటించింది. ఢాకాలో ఉన్న ట్రిబ్యునల్ కార్యాలయం వెలుపల అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లోపల తీర్పు చదివి విన్పించారు. నిరాయుధులైన పౌరులు, విద్యార్థులపై ఆటవిక దాడి, పైశాచిక రీతిలో భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ఇందుకు హసీనా చేసిన కవ్వింపు రెచ్చగొట్టే ప్రకటనలు, తన అధికార దుర్వినియోగం కారణం అని తీర్పులో తెలిపారు.
కాల్పుల్లో ఢాకా, ఇతర ప్రాంతాలలో వందలాది మంది దారుణ రీతిలో ప్రాణాలు వదలడానికి కారణం అని తేలిన వ్యక్తి వేరే చోటకు వెళ్లి ఉంటే శిక్షను తప్పించుకుంటుందా? అని పేర్కొంటూ మరణశిక్షను విధిస్తూ , అమలు చర్యలకు ఆదేశించారు. విద్యార్థుల సారధ్యంలో తలెత్తిన నిరసనల అణచివేత చర్యలలో 1400 మంది చనిపోయ్యారని ఐరాస మానవ హక్కుల సంస్థ కార్యాలయం తెలిపిన విషయాన్ని ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో అప్పటి హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు కూడా మరణశిక్ష విధించారు. అప్పటి పోలీసు విభాగం అధినేత చౌదురి అబ్దుల్లా అల్ మామూన్‌కు ఐదేళ్ల జైలు విధించారు.