నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్
పత్తి కొనుగోళ్లపై పడనున్న ప్రబావం
మన తెలంగాణ/హైదరాబాద్ :
రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ నిబంధనలతో ఆలస్యమయిన పత్తి కొనుగోళ్లు వర్షాలు, తేమ శాతాలతో అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఈ క్రమంలో జిన్నింగ్ మిల్లుల బంద్ ప్రకటనలతో సోమవారం నుండి పూర్తిగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. సిసిఐ, జిన్నింగ్ మిల్లులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 గ్రేడులుగా విభజించి కొనుగోళ్లు చేస్తుండడం, కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడం లాంటి నిబంధనలను విధించడంపై మిల్లర్లు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిన్నింగ్ మిల్లులకు పని కల్పించే విధంగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ నిబంధనలపై అసోసియేషన్ చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించక పోవడంతో ఈనెల 17 (సోమవారం) నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని మిల్లర్ల సంఘ నిర్ణయించింది.
నిలిచిపోనున్న సిసిఐ కొనుగోళ్లు
కాటన్ మిల్లర్ల అసోసియేషన్ ఈనెల 6 నుంచి బంద్ చేపట్టాలని నిర్ణయించినా మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో సమ్మెను 17వ తేదీకి వాయిదా వేశారు. ప్రతి ఏడాది అక్టోబరు మొదటి వారంలో సిసిఐ కొనుగోళ్లను ప్రారంభిస్తుంది. నిబంధనలు, టెండర్ల ఆలస్యంతో అక్టోబర్ చివరి వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా, కొన్ని రోజులకే కురిసిన అకాల వర్షాల కారణంగా పత్తిలో తేమ అధికంగా ఉండడంతో కొంత సమయం బ్రేక్ పడింది. మరల నవంబరులో కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ క్రమంలో జిన్నింగ్ మిల్లుల బంద్‌తో పత్తి కొనుగోళ్లపై తీవ్ర ప్రబావం పడనుంది.