ఉగ్రవాదంపై దర్యాప్తు కోసం డ్రైఫ్రూట్ వ్యాపారిని కస్టడీ లోకి తీసుకుని ప్రశ్నించిన తరువాత పోలీసులు విడిచిపెట్టేశారు.అయితే ఆ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్ముకశ్మీర్ లోని ఖాజీగుండ్‌లో ఈ సంఘటన జరిగింది. ఇటీవల వైట్ కాలర్‌టెర్రర్ మాడ్యూల్‌ను జమ్ముకశ్మీర్ పోలీసులు ఛేదించారు. డాక్టర్ల ముసుగులో కొందరు ఉగ్రవాద కుట్రకు పాల్పడినట్టు మొదట ఫరీదాబాద్‌లో బయటపడింది. నిందితుడైన డాక్టర్ అధీల్ రాథర్‌ను ఉత్తరప్రదేశ్ లోని సహరాన్‌పూర్‌లో జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ అదీల్ పొరుగున నివసించే ఫ్రూట్స్ వ్యాపారి బిలాల్ అహ్మద్, అతడి కుమారుడు జిస్రార్ బిలాల్‌ను జమ్ముకశ్మీర్ పోలీసులు ఆదివారం కస్టడీ లోకి తీసుకున్నారు. ప్రశ్నించిన తరువాత బిలాల్ అహ్మద్‌ను విడిచిపెట్టేశారు. తరువాత ఖాజీగుండ్‌కు చేరుకున్న బిలాల్ అహ్మద్ నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బిలాల్ అహ్మద్ కుమారుడు జిస్రార్ బిలాల్‌ను మరింత ప్రశ్నించేందుకు ఇంకా పోలీస్ కస్టడీ లోనే ఉంచారు.