ఆదివాసి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని పిసిసి ప్రచార కమిటి చైర్మన్, మాజీ ఎంపి మధుయాష్కి గౌడ్ అన్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన ఆదివాసి గిరిజన యువత ఇంట్రాక్షన్ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మధుయాష్కి అతిథిగా హాజరయ్యారు. మేరా యువ భారత్ అధ్వర్యంలో వ ట్రైబల్ యూత్ ఎక్సేంజ్ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు నగరంలో జరిగిన గిరిజన యువత సమ్మేళనంలో ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాలకు చెందిన యువతీ, యువకులు పాల్గొన్నారు. చివరి రోజున సోమవారం వారు రాజ్‌భవన్‌ను సందర్శించారు.
వారం రోజుల పాటు వారు నేర్చుకున్న అంశాలను గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మధుయాష్కీ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ ప్రసంగిస్తూ దేశానికి స్వాతంత్య్రం లభించి డ్బ్బై ఐదు సంవత్సరాలు దాటినా గిరిజన ప్రాంతాల్లో ఇంకా అవసరమైన మేరకు పాఠశాలలు, ఆసుపత్రులు లేవని, తాగు నీరు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఎవరు ఉన్నా ఆదివాసి యువత తమ హక్కుల కోసం ప్రశ్నించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యువజన అధికారి ఖుష్బు, రైల్వే బోర్డు సభ్యుడు నిర్మలా దేవి తదితరులు పాల్గొన్నారు.