మనతెలంగాణ/హైదరాబాద్: గిగ్, ప్లాట్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం తెలంగాణ ప్లాట్ ఫారం బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ పేర్కొన్నారు కేబినెట్ భేటీ అనంతరం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని, వారి కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ఆయన హామీనిచ్చారని అందులో భాగంగానే వారి కోసం గిగ్‌వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని ఆయన తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించిందని, ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా సమగ్ర గిగ్ వర్కర్ల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవుతుందని తెలిపారు.
గిగ్ వర్కర్స్ బిల్లులోని కీలకాంశాలు
ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లు ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం రవాణా (మొబిలిటీ), డెలివరీ, లాజిస్టిక్స్ రంగాల్లో పనిచేస్తున్నారు. వారు సాధారణంగా వారానికి 7 రోజుల పాటు రోజుకు 10 నుంచి-12 గంటల చొప్పున వర్క్ చేస్తున్నారు. వీరి ఆదాయంలో ప్లాట్‌ఫాంలు 20 శాతం నుంచి 30 శాతం వరకు కమిషన్‌గా వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గిగ్ వర్కర్లకు స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. తాజా బిల్లులో గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ‘తెలంగాణ ప్లాట్‌ఫాం -ఆధారిత గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ బోర్డు’ పేరుతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనుంది. ఈ బోర్డు గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టనుంది.
1-2 శాతం వాటాను గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి
అగ్రి గేటర్లకు (ప్లాట్‌ఫాంలు) చెల్లించే సొమ్ములో 1–2 శాతం వాటాను గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లీంచనున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తరఫున సిఎస్‌ఆర్ ఫండ్స్, విరాళాలు, గ్రాంట్లను ఈ నిధికి అందజేస్తుంది. ప్లాట్‌ఫాం చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అనేది పర్యవేక్షించేందుకు రియల్-టైమ్ ‘వెల్ఫేర్ ఫండ్ ఫీ వెరిఫికేషన్ సిస్టమ్ (డబ్ల్యుఎఫ్‌ఎఫ్ విఎస్)’ అందుబాటులోకి తీసుకురానున్నారు.
వివాదాల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థ
స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఉబర్, ఓలా వంటి ప్లాట్ ఫాంలు, కార్మికుల మధ్య తలెత్తే వివాదాలను ఇన్‌టైంలో పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పొందుపరిచింది. ఇందులో భాగంగా గిగ్ కార్మికుల జీతాల చెల్లింపులో ఆలస్యం, మోసాలు, అకారణంగా అకౌంట్లు సస్పెండ్ చేయడం.. లాంటి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారులను నియమిస్తారు.