కోల్‌కతా: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పలు సూచనలు చేశారు. పాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌కు తోడుగా మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలన్నాడు. కోచ్ గౌతమ్ గంభీర్ అంటే తనకు చాలా ఇష్టమని, 2011, టి20 ప్రపంచ కప్‌లలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడారు. భారత్‌లో మంచి పిచ్‌లు ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. షమీకి జట్టులోకి చోటు కల్పించడంతో బుమ్రా, సిరాజ్‌పై నమ్మకం కల్పించాలని తెలియజేశారు. భారత బ్యాట్స్‌మెన్లు 300కు పైగా పరుగులు చేస్తేనే విజయం సాధిస్తామన్నారు. గంభీర్ మంచి పిచ్‌లను ఎంచుకోవడంతో పాటు ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలన్నారు. టెస్టు మ్యాచ్‌లంటే ఐదు రోజుల్లో గెలవాలి కానీ మూడు రోజుల్లో గెలవడం కాదు అని గంగూలీ చురకలంటించారు. ఈడెన్ గార్డెన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై క్రికెట్ అభిమానులు, మాజీలు మండిపడుతున్నారు. బ్యాట్స్ మెన్లకు బదులుగా వాషింగ్టన్ సుందర్ ను ఎందుకు తీసుకున్నారని క్రికెట్ పండితులు ప్రశ్నిస్తున్నారు. మెయిన్ బ్యాట్స్ మెన్ ను తీసుకుంటే ఈ రోజు భారత్ గెలిచే అవకాశం ఉండేదని వాపోతున్నారు. భారత బ్యాట్స్‌మెన్లు 124 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించలేకపోయారు. రెండో టెస్టు గౌహతిలో నవంబర్ 22 నుంచి జరగనుంది. 2023లో షమీ టీమిండియా తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లకు అతడిని సెలెక్ట్ చేయలేదు. ఈ మధ్యలో జరిగిన రంజీ ట్రోఫీలో షమీ 115 ఓవర్లు వేసి 17 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.