కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుమార్తెను హత్య చేసి, కుమారునిపై హత్యాయత్నం చేసిన కేసులో వారి తండ్రి, నిందితుడు అనవేణి మల్లేష్ (38) సోమవారం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అనవేణి మల్లేష్, పోసవ్వను 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి హర్షిత్ (కొడుకు), హర్షిత (కూతురు) అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. దురదృష్టవశాత్తు, ఆ ఇద్దరు పిల్లలు చిన్నవయస్సులోనే మానసిక, శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వైద్య చికిత్స కోసం నిలోఫర్, ఉస్మానియా, నిమ్స్, నేషనల్ హ్యాండీక్యాప్డ్ హాస్పిటల్ (బోయినపల్లి), కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రులు, తిరుపతి బర్డ్స్ , స్విమ్స్ వంటి అనేక ఆసుపత్రులలో పరీక్షలు చేయించినా, పిల్లల పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. స్విమ్స్ వైద్యులు పిల్లల పరిస్థితి జీవితాంతం మారదని స్పష్టం చేయడంతో నిందితుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈనెల 15న మధ్యాహ్నం నిందితుడి భార్య శనివారం మార్కెట్‌కు వెళ్లిన సమయంలో,
మొదట కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నించగా, వారు నిరాకరించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.అనంతరం, నిందితుడు ఒక కాటన్ టవల్‌ను రెండు ముక్కలుగా చేసి, వాటిని ఉపయోగించి కూతురు (హర్షిత), కొడుకు (హర్షిత్) మెడకు ఉరి వేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ చర్యలో కూతురు మరణించగా, కొడుకుపై హత్యాయత్నం జరిగింది. హత్య అనంతరం, నిందితుడు టవల్ ముక్కలను బయట పారవేసి ఇంటినుంచి పారిపోయాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు అదే సాయంత్రం కరీంనగర్ నుండి హైదరాబాద్ జెబిఎస్‌కు చేరుకుని, అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. మరుసటి రోజు మంచిర్యాలలో తిరుగుతూ, పోలీసుల భయంతో తలదాచుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నట్లు సిఐ జాన్ రెడ్డి తెలిపారు.