సౌదీ అరేబియా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యానగర్ ప్రాంతానికి చెందిన 18మంది మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 18మంది ఈ ఘటనలో అగ్నికి ఆహుతి కాగా వీరిలో 11 మంది ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇంటికి తాళం వేసుకుని పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన వీరంతా నిమిషాల వ్యవధిలోనే కాలి బూడిద కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనాకు బయలుదేరిన ట్రావెల్స్ బస్సు సౌదీ అరేబియా రహదారిపై డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం అగ్నికి ఆహుతి అయిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ బస్సులో విద్యానగర్ ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉన్నారు. విద్యానగర లోని మారక్స్ భవన్ పక్కన విశ్రాంత రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ (66) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఉమ్రా యాత్ర కోసం నసీరుద్దీన్ సహ కుటుంబ సభ్యులు 18మంది ఈనెల 9వ తేదీన సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లారు.
అల్ మక్కా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలో 14 రోజుల ప్యాకేజ్ పై నసీరుద్దీన్‌తోపాటు అతని భార్య అత్తర్ బేగం (60 ), చిన్న కుమారుడు సల్లావుద్దీన్ (38), చిన్న కోడలు ఫరానా( 35) సహ వీరి ముగ్గురు పిల్లలు జైన్, ఫరీదా, శ్రీజ, నసీరుద్దీన్ పెద్ద కోడలు సన(40), ఆమె ముగ్గురు పిల్లలు మెహరీన్, మోజా, అజర్ సహ నసీరుద్దీన్ ముగ్గురు కుమార్తెలు అమీనా బేగం, షబానా బేగం, రిజ్వాన బేగం, వీరి పిల్లలు హనీశ్, జాఫర్, మరియానా(12), సహజ(5)లు ఉమ్రా యాత్రకు వెళ్ళారు. అమెరికాలో ఉన్న నసీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్, ముషీరాబాద్, ముసారాంబాగ్ లో ఉండే ముగ్గురు అల్లుళ్ళు, మరో ఇద్దరు మనుమలు మాత్రం వారితో వెళ్ళలేదు. పెద్ద కుమారుడు అమెరికాలో ఉండగా, విద్యానగర్ లోనే ఉండే చిన్న కుమారుడు సలావుద్దీన్ అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఉమ్రా యాత్ర పూర్తిచేసుకుని మక్కా నుంచి మదీనాకు వెళుతున్న వీరంతా బస్సు ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని మృతిచెందారు. మొత్తం 8మంది పెద్దలు, 10 మంది పిల్లలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో విద్యానగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యానగర్ లోని నసీరుద్దీన్ ఇంటికి చేరుకున్న బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులందరిని తీసుకుని యాత్రకు వెళ్లివస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లారంటూ బంధువులు విలపించారు. సిరాజుద్దీన్ ఒక్కడే అమెరికాలో ఉన్నందున బతికిపోయాడని, మొత్తం మూడు తరాలు ఒకే సారి మంటల్లో కాలిపోయారని చెపుతూ బంధువులు బోరున విలపించడం అందరిని కంటతడి పెట్టించింది.