ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కట్టి ఎనిమిది నెలలైనా అందని ప్రోసీడింగ్స్ …!
ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల లాగిన్‌లో దరఖాస్తులు పెండింగ్
ముడుపులు ముట్టచెబితే వారంరోజుల్లో క్లియర్
పురపాలక, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయ లోపం
దరఖాస్తుదారుడికి వివరాలు చెప్పని అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినా ప్రోసీడింగ్స్ మాత్రం వారికి అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నెలకొంది. పురపాలక శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ ఆలస్యం జరుగుతుందని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఫీజులు చెల్లించిన తర్వాత దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తర్వాతే ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ దశలోనూ నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు ఉంటే ప్రొసీడింగ్స్ ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిబంధనలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుసుము చెల్లించిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను తొలుత క్షేత్రస్థాయిలో (ఎల్1 క్లియరెన్సు) పరిశీలిస్తారు. ప్రారంభంలో రెవెన్యూ శాఖ నుంచి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఇరిగేషన్ నుంచి ఏఈ, తర్వాత హెచ్‌ఎండిఏ నుంచి జేపిఓ లేదా ఏపిఓ పరిశీలించి అనుమతులకు ఇస్తారు. అయితే ఇప్పటికే ఎల్1 తనిఖీలు పూర్తయినా ఎల్2, ఎల్3 దరఖాస్తులు ముందుకు కదలడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
20,00,493 మంది దరఖాస్తుదారులకు నోటీసులు
అక్రమ లే ఔట్‌లు లేదా లే ఔట్‌లు లేని ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానుల నుంచి 2020లో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 25,67,107 దరఖాస్తులు రాగా, అందులో సుమారుగా 5 లక్షల పైచిలుకు దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. (పురపాలక శాఖ నుంచి 15,37,159 దరఖాస్తులు గ్రామ పంచాయతీల నుంచి మరో 9లక్షల దరఖాస్తులు వచ్చాయి.) సుమారుగా 20,00,493 మంది దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ అధికారులు ఏప్రిల్ నోటీసులు జారీ చేయగా, సుమారుగా మే నెలలో 3,25,538 దరఖాస్తులదారులు మాత్రమే ప్లాట్ విస్తీర్ణం ఆధారంగా ఫీజును చెల్లించారు. అయితే, పురపాలక శాఖ అధికారులు ఈ దరఖాస్తులను స్క్రూటీని చేసి ఈ ఫీజును వసూల్ చేశారు. తరువాత ప్రోసీడింగ్స్ ఇవ్వాల్సిన అధికారులు దాని గురించి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం దరఖాస్తుదారులకే ప్రోసీడింగ్స్
ప్రస్తుతం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎనిమిది నెలలుగా ఈ దరఖాస్తులను తమ లాగిన్‌లో అలాగే పెట్టుకొని ఉంటున్నారు. ఇదేమని అడిగితే దరఖాస్తుదారుడు తమ దగ్గరకు రాలేదని వారు పేర్కొంటున్నారు. అయితే, డబ్బులు చెల్లించిన దరఖాస్తుదారుడికి ఈవిషయం తెలియకపోవడంతో ఇంకా ప్రోసీడింగ్ రావడానికి సమయం పడుతుందన్న ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫీజును చెల్లించిన దరఖాస్తు దారులు పురపాలక శాఖ అధికారుల దగ్గరకు వెళ్లి వాకబు చేస్తే ఇరిగేషన్, రెవెన్యూ లాగిన్ నుంచి క్లియర్ అయితేనే ప్రోసిడింగ్స్ ఇస్తామని వారు పేర్కొంటుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం దరఖాస్తుదారులకే ప్రోసీడింగ్ అందినట్టుగా తెలిసింది.
రూ.10 వేలు ఇస్తే వారంరోజుల్లో ప్రోసీడింగ్స్
ప్రస్తుతం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను దరఖాస్తుదారులు కలిసి డబ్బులు ఇస్తేనే క్లియర్ అవుతున్నాయని లేకపోతే దళారుల ద్వారా వెళితేనే ప్రోసీడింగ్స్ అందుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్‌ఎండిఏ పరిధిలో కొందరు దళారులు ఎల్2, ఎల్3లో దరఖాస్తులు పెండింగ్ ఉంటే సుమారుగా రూ.10 వేలు ఇస్తే వారంరోజుల్లో ప్రోసీడింగ్స్ ఉత్తర్వులను దరఖాస్తుదారులకు అందచేసినట్టుగా తెలిసింది. హెచ్‌ఎండిఏ పరిధిలోని 1,200 గ్రామాల పరిధిలోని 3.60 లక్షల దరఖాస్తులకు గాను 70 వేల దరఖాస్తులు మాత్రమే ఫీజులు చెల్లించగా అందులో కనీసం 20శాతం దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్‌లు అందకపోవడం విశేషం. ఇప్పటివరకు హెచ్‌ఎండిఏ అధికారులు 8,706 ప్రొసీడింగ్స్‌ను మాత్రమే జారీ చేసినట్టుగా తెలిసింది. అయితే ఫీజులు చెల్లించిన వారికి నిర్ణీత గడువు లోగా ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా కనీసం వాటి గురించి పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 8 వేల మందికే….
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 72,196 మంది ఫీజును చెల్లించగా కనీసం 8 వేల మంది దరఖాస్తుదారులకు మాత్రమే ప్రోసీడింగ్స్ అందాయని తెలిసింది. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో 40,881 మంది ఫీజును చెల్లించగా 3వేల మంది దరఖాస్తుదారులకు మాత్రమే ప్రోసీడింగ్స్ అందాయని, ఇక, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో 34,776 మంది ఫీజును చెల్లించగా సుమారుగా 2 వేల మందికే ప్రోసీడింగ్స్ అందాయని అధికారులు పేర్కొంటున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 29,321 మంది ఫీజులను చెల్లించగా 2,800ల మందికి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 24,020 మంది ఫీజును చెల్లించగా 2,500ల మందికి, సూర్యాపేట్ మున్సిపల్ మున్సిపల్ పరిధిలో 31,940 మంది ఫీజును చెల్లించగా 3,925 మంది దరఖాస్తుదారులకు ప్రోసీడింగ్స్ అందాయని, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 10 శాతం మందికి మాత్రమే ప్రోసీడింగ్స్ అందాయని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా పురపాలక శాఖ, గ్రామపంచాయతీల్లో ప్రోసీడింగ్స్‌లను ఇవ్వడానికి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కొర్రీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.