సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురై 42 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కెసిఆర్ విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపం ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని అన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కెసిఆర్ ప్రార్థించారు.
అత్యంత బాధాకరం : కెటిఆర్
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగాడ సంతాపం తెలిపారు. మక్కా నుండి మదీనాకు వెళుతున్న సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీలే ఉన్నారనే సమాచారం అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. లాగే ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సర్కారు అండగా నిలవాలని తెలిపారు.