అమరావతి: అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు అన్నను తమ్ముడు చంపేసి ఇంట్లోనే పాతిపెట్టాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్‌టిఆర్ కాలనీకి చెంది శ్రీనాథ్ (27) బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీనాథ్ పెద్దనాన్న కుమారుడు ప్రభాకర్ అతడి వద్ద నుంచి 40 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని నమ్మబలికాడు. శ్రీనాథ్ కూతురు అనారోగ్యానికి గురికావడంతో డబ్బులు కావాలని ప్రభాకర్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడు. డబ్బులు ఉన్నాయని కుప్పానికి వస్తే ఇస్తామని తమ్ముడికి శ్రీనాథ్ తెలిపాడు. 27న కుప్పానికి వచ్చిన శ్రీనాథ్‌కు మిఠాయిలో మత్తు మందు ఇచ్చారు. సృహకోల్పోయిన తరువాత తలపై సుత్తితో మోది చంపేశారు. ప్లాన్ ప్రకారం ఇంటిలో తీసిన గుంతలో పూడ్చి పెట్టి సిమెంట్ వేశారు. ఈ నెల 27 నుంచి తన భర్త కనిపించడంలేదని బెంగళూరులోని అతిబెలే పోలీస్ స్టేషన్‌లో శ్రీనాథ్ భార్య నీలా ఫిర్యాదు చేసింది. డబ్బుల కోసం కుప్పం వెళ్లాడని ఫిర్యాదులో వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసి తన భార్యకు శ్రీనాథ్ షేర్ చేసి లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వెంటనే పోలీసులు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ప్రభాకర్‌కు సహకరించిన జగదీశ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహానికి ఎంఆర్‌ఓ సమక్షంలో శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.