మన తెలంగాణ/హైదరాబాద్‌ః హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కూకట్‌పల్లిలో కాపు కులస్తుల ‘కార్తీక వన భోజనాల’ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందన్నారు. కొన్ని పార్టీలు ముస్లింలకు కొమ్ము కాసే పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హిందువులు కొందరు వివిధ కారణాలతో ఇతర మతాల్లో చేరిన వారంతా తిరిగి వెనక్కి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మీ కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని ఆయన తెలిపారు.
మతాలను మార్చుకుంటే దేవుళ్ళను మోసం చేసినట్లేనని ఆయన హెచ్చరికగా అన్నారు. హిందూ సనాతన ధర్మం గొప్పదని, హిందువుగా పుట్టడమే గర్వకారణమని ఆయన తెలిపారు. అన్ని కులాలు తమ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడుతూ హిందూ ధర్మం కోసం పని చేయాలని, హిందూ సనాతన ధర్మ రక్షణే తన లక్షమని ఆయనతెలిపారు. ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరించారు.