షాద్‌నగర్: తమ్ముడు ప్రేమ పెళ్లి చేసుకోవడంతో అన్నను దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఎల్లంపల్లి గ్రామంలో రాజశేఖర్, చంద్రశేఖర్ అనే అన్నదమ్ములు ఉన్నారు. తమ్ముడు చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో పది రోజుల క్రితం ప్రేమజంట గ్రామం నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో చంద్రశేఖర్ కుటుంబంపై యువతి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. తమ్ముడికి అన్న సహకరించాడని పగ పెట్టుకున్నారు. ఈ నెల 12న మాట్లాడుకుందామని నలుగురు వ్యక్తులు గ్రామ శివారులోనికి రమ్మని కబురు పెట్టారు. దీంతో రాజశేఖర్ అక్కడికి వెళ్లగానే కర్రలతో దాడి చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి మహబూబ్‌నగర్ జి ల్లా నవాబ్‌పేట మండలం ఎన్మనగండ గేటు సమీపంలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. తన పెద్ద కుమారుడు కనిపించడంతో షాద్‌నగర్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రితో పాటు పలువురు పేర్లను పోలీసులకు ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.