అమరావతి: ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. సిజెఐగా తన చివరి కార్యక్రమంలో కూడా అమరావతిలోనే కావడం విశేషం అని.. అన్నారు. ఎపి హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం లో ముఖ్య అతిథిగా సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ హాజరయ్యారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నానని, సిజెఐ గా ఇది తన చివరి కార్యక్రమమని తెలియజేశారు. తన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి అని..సాంఘీక, ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని అన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం.. ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలని, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ఓ స్థిర పవిత్రంగా భావించలేదని, కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారని గవాయ్ పేర్కొన్నారు.
అంశం ప్రాధాన్యతను బట్టి రాజ్యాంగ సవరణ విధానాలను అంబేడ్కర్ ఏర్పాటు చేశారని, కొన్ని అంశాల్లో రాజ్యాంగ సవరణ సులభం అని.. కొన్ని అంశాల్లో అది చాలా కఠినం అని.. అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే మొదటి రాజ్యాంగ సవరణ, రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగానికి మొదట సవరణచేసుకున్నామని చెప్పారు. రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి, సుప్రీం కోర్టుకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావనను తీసుకొచ్చిందని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. 1975 వరకూ ఆదేశిక సూత్రాలకంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని, కేశవానంద భారతి కేసు తర్వాత ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకూ సమ ప్రాధాన్యం దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎస్సి వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఏడుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని, ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లలోనూ క్రీమీలేయర్ విధానం ఉండాలన్నది తన అభిప్రాయం అని.. కొన్నేళ్లుగా న్యాయ విద్యలో మహిళలు బాగా రాణిస్తున్నారని సిజెఐ జస్టిస్ ఆర్ గవాయ్ స్పష్టం చేశారు.