పాట్నా: బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్రంలోని బిజెపి ఏకంగా రూ.14000 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులను దారిమళ్లించిందని జన్‌సురాజ్ నేత ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. మహిళల ఖాతాల్లోకి రూ.10000ల్లోకి నగదు బదిలీగా చేశారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు పాల్పడ్డ అత్యంత తీవ్రస్థాయి అనైతిక చర్య ఇదే అని విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన చెప్పారు. ప్రతి కుటుంబంలో మహిళ ఖాతాకు రూ పదివేలు పంపిస్తామని మోడీ ఎన్నికల కోడ్‌కు ముందు చెప్పారని, ఇందులో భాగంగానే ప్రపంచ బ్యాంక్ నిధులను బిజెపి తన ఇష్టారాజ్యంగా వాడుకుందని చెప్పారు.
బీహార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంక్ రూ 14000 కోట్లు మంజూరు చేసింది. వీటిని మోడీ తన డబుల్ ఇంజిన్ అధికారంతో దారిమళ్లించాడని, ఈ క్రమంలో భారీ మెజార్టీ సాదించారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు నితీశ్ కుమార్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పరిధిలో రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళా ఓటర్ల ఖాతాలకు ఈ డబ్బు పంపించిందని లెక్కలు తేల్చారు.