ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి ఏర్పాటయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సర కాలంగా పనిచేయడం లేదు. ప్రెస్ కౌన్సిల్ 14వ టర్మ్ (పదవీ కాలం) అక్టోబర్ 5, 2024న ముగిసిన తర్వాత, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలోని చట్టబద్ధమైన, క్వాసీ జుడిషియల్ వ్యవస్థకు క్రియాశీలమైన కమిటీ లేకపోవడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. పిసిఐ 15వ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి ఎటువంటి ఆచరణాత్మక చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. కొత్త కౌన్సిల్ ఏర్పాటులో జాప్యాన్ని ఆశ్చర్యకరంగా అభివర్ణిస్తూ, వివిధ జర్నలిస్ట్ సంస్థలు సంబంధిత అధికారులను అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. వార్తా ఛానెళ్లు, రేడియో , డిజిటల్ ప్లాట్ ఫామ్‌లను దాని అధికార పరిధిలోకి తీసుకురావడానికి, అవసరమైతే, దానిని మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చేందుకు పిసిఐకి అధికారం ఇవ్వాలని కూడా వారిలో చాలామంది డిమాండ్ చేశారు.
పిసిఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది మొదట 1966లో ప్రెస్ కౌన్సిల్ చట్టం 1965 కింద స్థాపించబడింది. తరువాత 1979లో ప్రెస్ కౌన్సిల్ చట్టం 1978 ద్వారా తిరిగి స్థాపించబడింది. దీని ప్రధాన లక్ష్యం దేశంలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం, వార్తాపత్రికలు, వార్తాసంస్థల ప్రమాణాలను మెరుగుపరచడం. ఈ కౌన్సిల్ మూడు సంవత్సరాల పదవీకాలాన్ని కలిగి ఉంది. గత సంవత్సరం చైర్‌పర్సన్ కొత్త కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోలేదు. పిసిఐలో ఒక చైర్మన్ (సాధారణంగా రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిని నియమిస్తారు) 28 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 13 మంది ప్రొఫెషనల్ జర్నలిస్టులు ఉంటారు. వీరిలో ఆరుగురు వార్తాపత్రికల సంపాదకులు, మరో ఏడు మంది పనిచేసే జర్నలిస్టులు ఉండాలి.
మరో ఆరు మంది సభ్యులు వార్తాపత్రికల నిర్వహణకు (యజమానులతో సహా) ప్రాతినిధ్యం వహిస్తారు. పెద్ద, మధ్యస్థ, చిన్న వార్తాపత్రికల నుండి ఒక్కొక్కరు తీసుకోబడతారు. ఒక సభ్యుడు వార్తా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తారు. పార్లమెంటులోని రెండు సభలు ఐదుగురు సభ్యులను పంపుతాయి. ముగ్గురు వ్యక్తులను విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సాహిత్య అకాడమీ వరుసగా విద్య, చట్టం, సాహిత్య రంగాల నుండి నామినేట్ చేస్తాయి. కానీ పిసిఐ వార్తాపత్రికలు, పత్రికలు, వార్తాసంస్థల పనితీరును మాత్రమే సమీక్షించగలదు. అంతేకాకుండా, మార్గదర్శకాలను అమలు చేయడానికి ఇది పరిమిత అధికారాన్ని కలిగి ఉంటుంది. మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు వార్తా సంస్థలు, వాటి సంపాదకులు, వర్కింగ్ జర్నలిస్టులను కూడా శిక్షించజాలదు.
భారతదేశంలో దాదాపు 1,00,000 ప్రచురణలను (రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా ఆమోదించినవి) ఇంగ్లీష్‌తో సహా వివిధ ఫ్రీక్వెన్సీలు, భాషలలో వెలువడుతూ ఉంటాయి. వేలాది పోర్టల్‌లు, వాట్సాప్ ఛానెల్‌లు, ఇతర డిజిటల్ అవుట్‌లెట్‌లతోపాటు దాదాపు 400 ఉపగ్రహ వార్తా ఛానెళ్లకు భారత్ నిలయం. కొవిడ్- 19 మహమ్మారి తర్వాత ఇతర మీడియా సంస్థల ఆధిపత్యం పెరగడంతో భారతీయ వార్తాపత్రికలు, పత్రికలు సహా మ్యాగజైన్ల (అమ్మకాలు, ప్రకటనల నుండి) ఆదాయాలు తగ్గుతూనే ఉన్నాయి. అయితే, సాంప్రదాయ మీడియా నెమ్మదిగా నష్టాల నుంచి కోలుకుంటుందని చాలామంది ప్రింట్ పరిశీలకులు విశ్వసిస్తున్నారు. డిజిటల్ మీడియా నుంచి వినియోగదారులు విశ్వసనీయ సమాచారం కోసం సాంప్రదాయ మీడియా వైపు మళ్లుతారనీ, పాఠకుల సంఖ్య తిరిగి పెరుగుతుందని భావిస్తున్నారు. 2030 నాటికి ప్రింట్ మీడియా అవుట్‌లెట్‌లు పాఠకుల సంఖ్యను దాదాపు రెండు రెట్లు పెంచుతాయని వారు వాదిస్తున్నారు.
ఇటీవల, అనేక మీడియా సంస్థలు పిసిఐ నియమాలలో మార్పులను వ్యతిరేకించాయి. జాతీయ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులకు బదులుగా వివిధ ప్రెస్ క్లబ్‌ల నుండి సభ్యులను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రెస్ క్లబ్‌లు సాధారణంగా వినోద కార్యకలాపాల కోసమేనని, వాటి కవరేజ్ ప్రాంతాలు సాధారణంగా ఒక నిర్దిష్ట ప్రాంతం, నగరం లేదా పట్టణానికి కట్టుబడి ఉంటాయని వారు వాదిస్తున్నారు. ప్రెస్ క్లబ్‌లు పని చేయని జర్నలిస్టులకు (విద్యావేత్తలు, రచయితలు, సినీ ప్రముఖులు, దౌత్యవేత్తలు వంటివారు) కూడా సభ్యత్వాలను ఇస్తాయి. అంతేకాకుండా, ప్రెస్ క్లబ్/ ప్రెస్ గిల్డ్/ మీడియా క్లబ్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రతినిధులు సభ్యులుగా ఉండరు. గుర్తింపు పొందిన జర్నలిస్ట్ యూనియన్లలో సాధారణంగా భారతదేశంలోని చాలా ప్రాంతాల సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, సిక్కిం మొదలైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అనుబంధ సంస్థలను కలిగి ఉన్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, 23,000 మందికి పైగా సభ్యులకు మద్దతు ఇస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రొఫెషనల్ స్క్రైబ్‌లకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఇంతలో, అవసరమైన అన్ని ప్రమాణాలను నెరవేర్చిన తర్వాత కూడా దాని సభ్యులను చేర్చుకోలేదని ఆల్ ఇండియా వర్కింగ్ న్యూస్ కెమెరామెన్స్ అసోసియేషన్ పిసిఐని సవాలు చేసింది.
ఒక నిర్దిష్ట వార్తాపత్రిక/వార్తా సంస్థ లేదా ఎడిటర్/వర్కింగ్ జర్నలిస్ట్ తన వృత్తిపరమైన దుష్ప్రవర్తనతో పాత్రికేయ ప్రమాణాలను దిగజార్చుతోందని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదులపై పిసిఐ చర్యలు తీసుకుంటుంది. కాబట్టి, అది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. పత్రికా స్వేచ్ఛకు హామీ ఇవ్వబడిన విషయంలో ప్రభుత్వ ప్రవర్తన సముచితం కాదని తేలితే పరిశీలనలు చేసే అధికారం కూడా దీనికి ఉంది. అందువల్ల కౌన్సిల్‌ను సక్రియం చేసి తిరిగి ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని రకాల మీడియా సంస్థలను తన పరిధిలోకి తీసుకు వచ్చేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలి.
(మొదటి ప్రెస్ కమిషన్ (1956) సిఫార్సు మేరకు 1966, నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాట యింది. కౌన్సిల్ ఏర్పడిన రోజును ప్రతి సంవత్సరం జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుకుంటున్నాం)
నవ థాకురియా