గిగ్ వర్కర్ల ముసాయిదా, ప్రజా పాలన వియోజత్సవాల ప్రణాళిక ఖరారు,
సదస్సు నిర్వహణ, విదేశీ ప్రతినిధులకు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు,
స్థానిక సంస్థల ఎన్నికలు, బిసి రిజర్వేషన్‌లపై చర్చ
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ నేడు భేటీ కానుంది. మధ్యాహ్నాం మూడు గంటలకు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభంకానుంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు బిసి రిజర్వేషన్ల అమలు, హైకోర్టు తీర్పుతో పాటు మిగతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో భాగంగా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది.
రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టమైన కోర్టు తీర్పులు ఉండటంతో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వపరంగా అమలు చేయటం ఇబ్బందికరంగా మారడంతో పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.అయితే, ఈ అంశంపై మంత్రివర్గంలో లోతుగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మంత్రులతో సిఎం చర్చించనున్నారు. ఈ ఎన్నికలపై మంత్రుల అభిప్రాయాలతో పాటు న్యాయనిపుణుల సలహాలను తీసుకోనున్నారు.
పూర్తి సమాచారాన్ని అందుబాటులో…..
మంత్రివర్గం సమావేశం ఎజెండాకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సిఎస్ రామకృష్ణారావు ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయగా హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్‌లో జరగాల్సిన ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది.
ప్రజా పాలన విజయోత్సవాలపై..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఈ డిసెంబర్ 07వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తి కానుంది. దీంతో డిసెంబర్ రెండో వారంలో ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహించనుంది. అందుకే ఈ ఉత్సవాల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం కోరే అవకాశం ఉందని సమాచారం. ఉత్సవాల సందర్భంలో షెడ్యూల్ వెలువడితే ప్రజలు, పార్టీ గ్రామీణ క్యాడర్ మొత్తం ఎన్నికల్లో తలమునకలవుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దృష్ట్యా ఎన్నికల ప్రక్రియ డిసెంబర్‌లో ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం డిసెంబర్ 8,9వ తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్2025ను నిర్వహించనుంది. దీనికి దేశ, విదేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. 9వ తేదీన ‘తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ఈ సదస్సులో ఆవిష్కరిస్తారు.
ఈ నేపథ్యంలోనే ప్రజా పాలన వియోజత్సవాల ప్రణాళిక ఖరారు, సదస్సు నిర్వహణ, విదేశీ ప్రతినిధులకు సౌకర్యాలు, భద్రత, ఏర్పాట్లపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తికావడంతో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో ఇన్ని రోజులపాటు పెండింగ్‌లో ఉన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. గిగ్ వర్కర్ల ముసాయిదాపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇక ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.