మన తెలంగాణ/హైదరాబాద్ : టోక్యో డెఫ్లింపిక్స్ 2025లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ స్పోర్ట్ పాలసీలో భాగంగా షూటర్ ధనుష్‌కు ప్రభుత్వం తరుపున 1కోటి 20 లక్షల రూపాయల ప్రోత్సాహం అందచేస్తామని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్ నూతన స్కూల్ ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్బంగా క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.క్రీడల్లో క్రమశిక్షణ చాలా అవసరమని,ఏకాగ్రత ఉంటేనే క్రీడల్లో రాణించగలమని విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలని సూచించారు.
విద్యార్థి దశలోనే క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ కన్నా చిన్న దేశమైన సౌత్ కొరియా ఒలంపిక్స్ లో 36 స్వర్ణ పథకాలు గెలిచిందని, కానీ మనం ఒలంపిక్స్ లో ఎందుకు పథకాలు గెలవలేక పోతున్నామో విద్యార్థులు ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం స్పోర్ట్ హబ్ ఆఫ్ ఇండియాగా ఎదగడమే స్పోర్ట్ పాలసీ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోరట్స్ యూనివర్సిటీని స్థాపిస్తుందని ఈ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోరట్స్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో విద్యను అందించడం జరుగుతుందని తెలియజేశారు.
ఇప్పటికే కోచ్ కోసం గురు వందనం పథకం కింద తెలంగాణ క్రీడా శాఖ కోచ్ల కోసం మొదటిసారిగా సంక్షేమ పథకం ప్రారంభించిందన్నారు. ఈ పథకం ద్వారా కోచ్ లకు 15 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని స్టేడియాల్లో వేసవి శిక్షణ శిబిరాలు, శిక్షణ కార్యక్రమాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని తెలిపారు..ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి,కడియం శ్రీహరి,నాగరాజు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,మేయర్ గుండు సుధారాణి,సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.