మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది, ఎముకలు కొరికేలా చలి తీవ్రత మారింది. రాష్ట్రమంతటా సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గత నాలుగు రోజుల నుండి సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలి గుప్పిట్లో బందీ అయ్యారు. ఆదివారం తొమ్మిది జిల్లాలో 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి గాలులు, పొగమంచుతో రహదారులు కమ్ముకుంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. ఆదివారం ఉదయం వరకు కుమురం భీం ఆసిఫాబాద్‌లో 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్లు పేర్కొంది. పొగ మంచు, శీతల గాలుల కారణంగా రాత్రి పూట చలి ఎక్కువగా ఉంటుందని, రానున్న మూడు రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు వెల్లడించారు. నవంబర్ నెల నివేదిక ప్రకారం పగటి పూట ఉష్ణగ్రతలు తీవ్రత తగ్గి రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాత్రి కంటే ఉదయం 4 గంటల ప్రాంతంలో చలి ఎక్కువగా నమోదవుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తుందని, వాతావరణ శాఖ వెల్లడించింది.
నమోదయిన ఉష్ణోగ్రతలు ఇలా
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం వరకు నమోదయిన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా కుమురం భీం ఆసిఫాబాద్‌లో 7.4 డిగ్రీలు కాగా, వరుసగా సంగారెడ్డిలో 8.1, ఆదిలాబాద్‌లో 8.4, రాజన్న సిరిసిల్లలో 8.6, వికారాబాద్‌లో 9.1, కామారెడ్డిలో 9.4, సిద్దిపేటలో 9.6, జగిత్యాలలో 9.7, నిజామాబాద్‌లో 9.9, మెదక్, రంగారెడ్డిలో 10, నిర్మల్‌లో 10.1, కరీంగనర్‌లో 10.6, పెద్దపల్లిల్లో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. హైదరాబాద్‌లో 12.7 డిగ్రీలు నమోదయినట్లు టిజిపిడిఎస్ వెల్లడించింది.