మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిఆర్‌ఎస్ పార్టీ ఓటమి తర్వాత పార్టీ అధినేత కెసిఆర్‌ను, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. శనివారం ఎర్రవెళ్లిలోని కెసిఆర్ నివాసానికి వెళ్లిన కెటిఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమికి గల కారణాలు అధినేతకు వివరించారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో బిఆర్‌ఎ స్ ఓటమి.. తదనంతర పరిణామాలపై కెసిఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. భవిష్యత్ కార్యచరణపైనా సమాలోచనలు చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రారంభానికి ముందు జిల్లాల పర్యటనకు సిద్ధం కావాలని కెటిఆర్‌ను కెసిఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యం లో మంగళవారం నాడు తెలంగాణ భవన్ వేదికగా బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల తో కెటిఆర్ భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్‌లో ఓ టమి నేపథ్యంలో పార్టీ కేడర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పరాజయం తర్వా త జూబ్లీహిల్స్ కార్యకర్తలు నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని కెటిఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను ఉత్తేజపరచడం, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కెటిఆర్ పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మరింతగా పోరాటం చేయాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చే స్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుస పరాజయాలతో బిఆర్‌ఎస్ సతమతమవుతోంది.
విజయం ఖాయమనుకున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి పాలై, మరో సిట్టింగ్ అసెంబ్లీ స్థానాన్ని బిఆర్‌ఎస్ పార్టీ కోల్పోయింది. ప్రచారంలో ముందంజలో ఉన్నప్పటికీ పోల్ మేనేజ్‌మెంట్‌లో విఫలమై భారీ తేడాతో జూబ్లీహిల్స్‌లో ఓటమి పాలైనట్లుగా పార్టీ వర్గాలు విశ్లేషించుకుంటున్నట్లు తెలిసింది. బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి మాగంటి సునీతను పార్టీ అభ్యర్థిగా బిఆర్‌ఎస్ బరిలో దింపింది. మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభల నుంచే ఉపఎన్నిక ప్రచారానికి బిఆర్‌ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. బాకీ కార్డుల పేరిట కాంగ్రెస్ పార్టీ అమలు చేయని ఎన్నికల హామీలు, గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. హైడ్రా, ఆటో డ్రైవర్లు, తదితర అంశాలను విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నీ తానై ఉపఎన్నిక బాధ్యతను భుజానికెత్తుకున్నారు. పార్టీ అగ్రనేత హరీష్ రావు సహా మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి, పార్టీ యంత్రాంగం అంతా ఉపఎన్నికల్లో పని చేశారు. మిగిలిన పార్టీల కన్నా ముందుగానే బిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్ ఓటమి పాలు కావడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రచారంలో ముందంజ…పోల్ మేనేజ్‌మెంట్‌లో డీలా
అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను తగినట్లుగా ప్రతి వ్యూహాలు రచించడంలో కొంత వెనుబడినట్లుగా బిఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నట్లు తెలిసింది.సైలెంట్ ఓటింగ్‌పై బిఆర్‌ఎస్ భారీగా ఆశలు పెట్టుకొంది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలు ఓట్ల రూపంలో తమ వ్యతిరేకతన చూపుతారని ఆశించారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకొని తమకు ఓటు వేయాలని కెటిఆర్ రోడ్ షోలలో బహిరంగంగానే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ బిఆర్‌ఎస్ పార్టీ నమ్ముకొన్న సైలెంట్ ఓటింగ్ అంతగా ప్రభావం చూపినట్లుగా కనిపించలేదు. ముందు జూబ్లీహిల్స్‌లో విజయం ఖాయమన్న ధీమాతో గులాబీ పార్టీ కనిపించింది. సర్వేలు తమకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని, విజయం ఖాయమన్న విశ్వాసంతో నేతలు కనిపించారు.ఎన్నికల ప్రచారం ముగిసే వరకు పైచేయిగా ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ, ఆ తర్వాత డీలా పడిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు బలంగా లేకపోవడం, సంస్థాగత నిర్మాణం లేని లోటు స్పష్టంగా కనిపించింది. బిఆర్‌ఎస్ ప్రచార పర్వాన్ని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు ముందుండి నడిపించారు. ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత వారు వెళ్లిపోవడంతో, ప్రభావవంతంగా పోల్ మేనేజ్‌మెంట్ చేసే వారు లేకపోవడం బిఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణంగా పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రచారం గడువు ముగిసిన తర్వాత అధికార పార్టీ నేతలు ఇంటింటికీ తిరిగి సమర్థవంతంగా పోల్ మేజేజ్‌మెంట్ చేయడం, పోల్ మేనేజ్‌మెంట్‌లో బిఆర్‌ఎస్ పార్టీ కొంత వెనుకబడిపోవడం వల్లనే జూబ్లీహిల్స్‌లో ఓటమి పాలయ్యామని బిఆర్‌ఎస్ శ్రేణులు విశ్లేషించుకున్నట్లు తెలిసింది.
కలిసి రాని సానుభూతి
సిట్టింగ్ ఎంఎల్‌ఎ మరణిస్తే ఉప ఎన్నికలో కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వడం ద్వారా సానుభూతి కలిసి వస్తుందన్న సెంటిమెంట్ బిఆర్‌ఎస్‌కు పెద్దగా కలిసి రానట్లుగా తెలుస్తోంది. నాగార్జునసాగర్‌లో నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ మాత్రమే ఈ తరహాలో గెలుపొందారు. దుబ్బాక, ఇటీవల జరిగిన కంటోన్మెంట్‌తోపాటు తాజాగా జూబ్లీహిల్స్‌లోనూ బిఆర్‌ఎస్‌కు సానుభూతి కలిసి రాలేదు.