మనతెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ సర్కారు హయాంలో పదేళ్లు ఎంపి, ఎంఎల్‌సి పదవుల్లో ఉన్నప్పుడు లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయని బిఆర్‌ఎస్ శాసనసభ విప్ కెపి వివేకానంద గౌడ్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి, ఆ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత బిఆర్‌ఎస్ పార్టీపై, మాజీ మంత్రులపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఏమిటీ..? అని అడిగారు. అలాంటి వ్యాఖ్యలు ఎవరి కోసం…ఎవరి ప్రయోజనాల కోసం..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ విషయంతో కవిత ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం కెపి వివేకానంద మీడియాతో మాటాడుతూ, బిఆర్‌ఎస్ లక్ష్యంగా చేసుకుని కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తే.. కాంగ్రెస్‌కు ప్రయోజకరంగా ఉన్నట్టుగా అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు, రౌడీయిజం, ఈ ఎన్నికలో గెలిచిన తీరు తెన్నులు ఆమెకు కనబడలేదా..? అని ప్రశ్నించారు. పార్టీ పెడితే పెట్టుకోవాలి, నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి ప్రయోజన కరంగా ఉండే విధంగా కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
కాంగ్రెస్ ట్రాప్‌లో కవిత..
ఎంఎల్‌సి కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్‌లో పడ్డారని వివేకానంద గౌడ్ ఆరోపించారు. అందుకే బిఆర్‌ఎస్ మాజీ మంత్రులను విమర్శిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ కూతురిగా బిఆర్‌ఎస్ పార్టీలో, నాయకులు, కార్యకర్తలలో ఆమెకు చాలా గౌరవం ఉందని, పార్టీలో సముచిత స్థానం కల్పించిందని చెప్పారు. ఇంటి బిడ్డగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో గౌరవించారని తెలిపారు. ఆమె ఇలాంటి వ్యాఖ్యల వల్ల సభ్యసమాజం ఏమనుకుంటుందో అర్థం చేసుకోవాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలో బిఆర్‌ఎస్ కార్యకర్తలను పోరాటాలు చిన్నగా చేసి మాట్లాడారని, కానీ అధికార దుర్వినియోగం చేసి, రౌడీయిజంతో అరాచకాలు చేస్తే, అలాంటివి కనబడలేదా..? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులను ఉద్దేశిస్తూ కృష్ణార్జునులు అని సంభోధిస్తూ, సెటైర్లు వేయడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వల్లనే సిఎం రేవంత్‌రెడ్డి గల్లీగల్లీ తిరిగారని అన్నారు. కెసిఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని, ఆయనే తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని తెలంగాణ ప్రజానీకం ముక్తకంఠంతో కోరుకుంటుందని వివేకానంద స్పష్టం చేశారు.