హీరో అల్లరి నరేష్ నటిస్తున్న థ్రిల్లర్ ’12ఎ రైల్వే కాలనీ’ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ “అనిల్ పర్యవేక్షణలో నాని ఈ సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది. సినిమాని అద్భుతంగా తీశారు. ఇందులో నరేష్‌కి జోడిగా కనిపిస్తాను. నా క్యారెక్టర్ పేరు ఆరాధన. నా క్యారెక్టర్ ఎక్కడ నుంచి వచ్చింది, ఏం చేస్తుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తన పని మీదే శ్రద్ధ పెట్టే క్యారెక్టర్. అలాంటి లైఫ్‌లో వచ్చిన ప్రేమ స్టోరీ ఎలా ముందుకెళ్ళింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆరాధన క్యారెక్టర్ లేకపోతే ఈ కథ లేదు. సినిమా చూసిన తర్వాత నా క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అల్లరి నరేష్‌తో నటించడం అనేది నా కెరీర్‌కి చాలా మైలేజ్ ఇస్తుంది. ఇది మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్. ఇక ఈ సినిమాలో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. ఇందులో మూడు పాటలు కూడా కథకు చాలా తోడ్పడతాయి. ఐదేళ్ల నా కెరీర్‌లో విరూపాక్ష, పొలిమేర చిత్రాలు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. లైలా సినిమా వర్కవుట్ అయి ఉంటే మంచి పేరు వచ్చేది. ప్రస్తుతం నేను చేస్తున్న డెకాయిట్ షూటింగ్ జరుగుతోంది. ఇంకొక పెద్ద సినిమా ఉంది. అది మేకర్స్ ప్రకటిస్తారు. అలాగే పొలిమేర 3 కూడా మొదలు పెట్టాలి” అని పేర్కొన్నారు.