ప్రధాని నరేంద్రమోడీ శనివారం గుజరాత్ రాష్ట్రం లోని సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌ను సందర్శించి ముంబైఅహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ (ఎంఎహెచ్‌ఎస్‌ఆర్ ) పనుల పురోగతిని సమీక్షించారు. శనివారం ఉదయం సూరత్ విమానాశ్రయంలో దిగిన వెంటనే బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మాణం అవుతున్న అంట్రోలి ఏరియాకు వెళ్లారు. దేశం లోనే అత్యంత ప్రతిష్టాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఈ కారిడార్ ఒకటి. దీని పొడవు సుమారు 508 కిమీ. ఇందులో 352 కిమీ లైను గుజరాత్ , దాద్రా, నగర్‌హవేలీ మీదుగా నిర్మాణమవుతోంది.
మరో 156 కిమీ లైను నిర్మాణం మహారాష్ట్ర పరిధిలోకి వస్తుంది. ఈ కారిడార్ సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదరా, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయినర్, విరార్,థానే, ముంబై వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. ఆ తరువాత గిరిజన ప్రాంతమైన నర్మదా జిల్లా లోని డెడియాపడ పట్టణంలో గిరిజన పోరాట యోధుడు బిర్సాముండా జయంతి వేడుకలకు హాజరయ్యారు. అక్కడ రూ.9700 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకు ముందు సగ్‌బర తాలూకా దేవ్‌మోగ్రా ఆలయంలో పండోరి మాత కు పూజలు చేశారు.