వదిలేది లేదు…బిబిసిపై 5 బిలియన్ డాలర్ల కేసు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి..ప్రకంపనలు
డాక్యుమెంటరీపై క్షమాపణలు తెలిపిన వార్తాసంస్థ
సరిపోదని, పరువు నష్టం భర్తీ కష్టమన్న లాయర్లు
వాషింగ్టన్ ః అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రఖ్యాత వార్తా సంస్థ బిబిసిపై 5 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావాకు దిగనున్నారు. తనపై తప్పుడు రికార్డింగ్ వీడియోను బిబిసి ప్రసారం చేసిందని, దీనితో తనకు భారీ స్థాయిలో ఆర్థిక నష్టం, అప్రతిష్ట ఏర్పడిందని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ముందే ఈ వీడియో పట్ల బిబిసి క్షమాపణలు తెలిపింది. పొరపాటు జరిగిందని తెలియచేసుకుంది. అయితే తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సి ఉంటుందని, బిబిసిపై కేసుకు దిగుతున్నానని ట్రంప్ వెల్లడించారు. ఈ పరిణామంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. వచ్చే వారం తమ పరువునుష్టం దావా దాఖలు చేస్తానని శనివారం ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు.
2021 జనవరిలో ట్రంప్ వెలువరించిన ఓ ప్రసంగపు వీడియోలోని కొంత భాగం ఇప్పుడు వివాదానికి దారితీసింది. దీనిని చాలా తప్పుగా చిత్రీకరించారని, ఈ వీడియో తనకు మనస్థాపాన్ని కల్గించిందని, ఆర్థిక నష్టానికి దారితీసేదిగా ఉందని, తాను బిబిసిని వదిలేది లేదని ట్రంప్ మీడియాకు తెలిపారు. బిబిసి సారీతో సరిపోదని స్పష్టం చేశారు. బిబిసి అధికారికంగా డాక్యుమెంటరీని సవరించుకోవల్సి ఉంటుంది. తిరిగి సరిగ్గా ప్రసారం చేయాల్సి ఉంటుంది. దీనికి తోడుగా తమ క్లయింట్‌కు ముందుగా 1 బిలియన్ డాలర్లు చెల్లించుకోవల్సి ఉంటుంది. లేకపోతే 5 బిలియన్ డాలర్ల దావా తప్పదని ట్రంప్ లాయర్లు హెచ్చరించారు. ఎడిటింగ్‌లో తప్పిదం జరిగిందని బిబిసి అంగీకరించింది. ట్రంప్ సమక్షానికి వ్యక్తిగతంగా క్షమాపణలు తెలిపింది. అయితే తప్పిదం వల్లనే ఇది జరిగిందని, దురుద్ధేశం లేదని, పరువునష్టం ప్రస్తావన సరికాదని వివరణ ఇచ్చుకున్నారు.
ఇకపై ఈ వీడియో తిరిగి ప్రసారం చేసేది లేదని కూడా బిబిసి ప్రసార విభాగం తెలిపింది. తన ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. వచ్చే వారం ఎప్పుడైనా 1 బిలియన్ డాలర్లు నుంచి 5 బిలియన్ డాలర్ల వరకూ బిబిసిపై దావా తప్పదని హెచ్చరించారు. తాను ఊరుకునేది లేదని. వారు ఇప్పటికీ కూడా మోసానికి పాల్పడినట్లు చెప్పడం లేదు. సారీతో సరిపోతుందా? అని నిలదీశారు. తాను చెప్పని మాటలను చెప్పినట్లుగా చెప్పించడం ఎంత వరకూ సముచితం అని ప్రశ్నించారు. ట్రంప్ దేశాధ్యక్ష ఎన్నికల దశలో క్యాపిటల్ భవనం వద్ద ఘర్షణలను ప్రేరేపించినట్లు తెలిపే ఆయన ప్రసంగంలోని భాగాల డాక్యుమెంటరీ వీడియో దుమారానికి దారితీసింది. ట్రంప్ పరువునష్టం దావా బెదిరింపులతో ఇప్పుడు బిబిసిలో పెను ప్రకంపనలు చెలరేగాయి. పలువురు కీలక వార్తా విభాగాల అధినేతలు రాజీనామాలు చేయాల్సి వచ్చింది.