అమరావతి: కొందరు డెవలపర్లు చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి వెంచర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఎపి శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. అక్రమ లేఔట్లను అరికట్టాలని లేకుండా తనే రంగంలోకి దిగుతానని హెచ్చిరంచారు. గత ఐదు సంవత్సరాలు ఎపిలో చీకటి యుగంగా ఉందని, రియల్ ఎస్టేట్ రంగం ఆగమైందని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎపికి మంచి రోజులు వచ్చాయని ప్రశంసించారు. విశాఖలో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో షాలో అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. పర్యాటకులు కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వస్తారని, పది గంటలు దాటి వారిపై కేసులు పెడితే ఎలా అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. విశాఖలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే ఫ్రీజోన్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. ఎపి ప్రజలు సరదా కోసం శ్రీలంక, గోవాలాంటి ప్రాంతాల వెళ్తున్నారని, అక్కడ ఉండే వాతావరణం ఇక్కడే కల్పిస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. భర్త సరదాగా రెండు పెగ్గులు వేస్తే భార్య ఐస్‌క్రీమ్ తినేలా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తే బాగుంటుందని అయ్యన్న పాత్రుడు చమత్కరించారు.